మండుతున్న భానుడు
ఐదు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫ మధ్యాహ్నం వేళ గడపదాటని ప్రజలు ఫ నిర్మానుష్యంగా కనిపిస్తున్న ప్రధాన రహదారులు
మధ్యాహ్న సమయంలో జనసంచారం లేని నల్లగొండలోని ఎన్జీ కళాశాల చౌరస్తా
నల్లగొండ టౌన్: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 1న గరిష్ట ఉష్ణోగ్రత 34.0, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది. తర్వాత రోజునుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 36.01 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలుగా నమోదైంది.
ముదురుతున్న ఎండలు
ఎండలు ముదురుతుండడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు వాతావరణం చల్లగా ఉండి 9 గంటల తర్వాత నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పాదచారులు, వాహనదారులు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మున్ముందు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగినప్పటికి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉత్తర గాలులు వీస్తున్నాయి. దీనికారణంగా వడగాలులు తగ్గాయి. దీనివల్ల ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.
ఇప్పడే ఇలా ఉంటే..
మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత 36.1 డిగ్రీల వరకు ఉంటే మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక, ఏప్రిల్, మే రెండు మాసాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అవసరమైతే తప్ప ఉదయం 10 గంటల తర్వాత బయట తిరగవద్దని చెబుతున్నారు. అత్యవసరమైతే గొడుగులు, టోపీలు, కాటన్ దుస్తులు ధరించి బయటకు వెళ్లాలంటున్నారు.
ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల్లో..)
తేది 1 2 3 4 5 6
ఉష్ణోగ్రత 34.0 34.5 35 36 36.5 36.1
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు ఎండలో తిరగొద్దు. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీటిని, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్ ద్రావణం తాగాలి. వదులు కాటన్ ధుస్తులు ధరించాలి. ఎండలో తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. వడదెబ్బ బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
– డాక్టర్ ఈశ్వర్, జనరల్ మెడిసిన్, నల్లగొండ
మండుతున్న భానుడు
మండుతున్న భానుడు
మండుతున్న భానుడు
Comments
Please login to add a commentAdd a comment