ఆమె కోసం ‘విన్నపం’
ఫ మహిళలకు అండగా నిలుస్తున్న
గోపాలపురం వాసి లీలావతి
ఫ ఆమె పోరాటం ఫలితంగా
విద్యార్థినులకు హెల్త్ కిట్లు
హుజూర్‌నగర్ : ఆమె ఆరోతరగతి చదువుతోంది. ఆ సమయంలో వాళ్ల నాన్న సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. రోజూ వచ్చిపోయేవారితో ఇల్లంతా సందడిగా ఉండేది. ఊరి ప్రజలు ఇంటికి వచ్చి నాన్నతో సమస్యలు చెప్పుకోవడం వాటిని ఆయన తీర్చడం చూస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ బాలికకు ఓ ఆలోచన తట్టింది. నాన్నలాగా ప్రజల కోసం తానూ ఏదో ఒకటి చేయాలని తలచింది. ఆ ఆలోచన నుంచి పురుడుపోసుకుందే.. ‘విన్నపం ఒక పోరాటం’ అనే స్వచ్ఛంద సంస్థ. విద్యార్థినులు, మహిళల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దీనిని ఏర్పాటు చేసి ముందుకుసాగుతున్నారు చీకూరి లీలావతి.
తొమ్మిదో తరగతిలోనే..
హుజూర్‌నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చీకూరి తిరుపతయ్య కూతురు లీలావతి ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ ఫర్మామింగ్ ఆర్ట్స్) చేస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ‘పోరాటం ఒక విన్నపం’ అనే స్వచ్ఛంద సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గోపాలపురం గ్రామంలో రక్తదాన శిబిరం, వైద్య శిబిరాలు వంటి సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. ఆ తర్వాత అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపడానికి స్వగ్రామంలో వేసవిలో కరాటేలో శిక్షణ ఇప్పించేవారు. ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేలా తెలియ జెప్పడం, బాల్య వివాహలు నిర్మూలించడం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేశారు.
పదేళ్ల క్రితం..
విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ఇవాలని సంస్థ తరఫున పదేళ్ల క్రితం సీఎంకు లేఖలు రాశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో అప్పటి ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థినులకు హెల్త్ కిట్లు ఇవ్వడం ఆరంభించింది. అంతేకాకుండా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే విద్య లాంటివి సబ్జెక్టుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
విన్నపానికి అసెంబ్లీలో చర్చ
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒంటరి మహిళ, వితంతు పింఛన్ పేర్లను తొలగించి వాటి స్థానంలో మహిళల్లో ఆత్మస్థైర్యం ప్రతిబింబించేలా.. మహిళా శక్తి పింఛన్లు అని పేరు మార్చాలని తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది.
ఆర్గానిక్స్ ప్యాడ్స్ ఇవ్వాలని పోరాటం..
ప్రస్తుతం రేషన్ దుకాణాలు, స్కూళ్లు, బస్టాండ్లలో మహిళలకు ఆర్గానిక్ ప్యాడ్స్ ఉచితంగా అందజేయాలనేది విన్నపం ఒక పోరాటం సంస్థ డిమాండ్ చేస్తోంది. ఆర్గానిక్ ప్యాడ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని వాటిని మహిళలకు కేటాయించాలని ఆమె కోరుతున్నారు. ఇందుకోసం తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చీకూరి లీలావతి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment