నృసింహుడి రథోత్సవం.. కనుల వైభవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా సాగింది. శనివారం రాత్రి లక్ష్మీదేవిని పరియణమాడిన నృసింహుడు.. మరుసటి రోజు ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీమహావిష్ణువుగా రూపుదాల్చి గరుడవాహనంపై మాడ వీధుల్లో విహరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట సేవను వేంచేపు చేసి వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తూ ప్రధానార్చకులు అలంకార విశిష్టతను వివరించారు. ఈ వేడుకలో కలెక్టర్ హనుమంతరావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు, పారాయణికులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దివ్య విమాన రథోత్సవం
సాయంత్రం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్ర జపములు, ద్వారాతోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాలు, మహామంత్ర పుష్పం, పురాణ, ఇతిహాస, విజ్ఞాపన వేడుకలు చేపట్టారు. అనంతరం రథాంగ హోమం, రథబలి, శ్రీస్వామివారి ఉత్సవమూర్తుల అలంకార సేవను ఊరేగించారు. రాత్రి దివ్యవిమాన రథంపై ఆశీనులైన కల్యాణమూర్తులు.. ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించారు. భాజాభజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాలు, నృత్యాలు చేస్తుండగా రథోత్సవం ముందుకు సాగింది. తిరు, మాడ వీధులు నృసింహుడి నామస్మరణతో మార్మోగాయి. నృత్యాలతో సందడి చేశారు. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆలయ తిరు, మాడ వీధుల్లో
విహరించిన కల్యాణమూర్తులు
ఉదయం శ్రీమహావిష్ణువు
అలంకారంలో నృసింహుడి దర్శనం
నేటి కార్యక్రమాలు
సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రి శ్రీపుష్ప యాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నారు.
నృసింహుడి రథోత్సవం.. కనుల వైభవం
Comments
Please login to add a commentAdd a comment