ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మునుగోడు: గొర్రెలను మేపేందుకు వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం మునుగోడు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ(58) మునుగోడులో నివాసముంటున్న తన కుమారుడు వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొర్రెలను మేతకు తోలుకుని వెళ్తుండగా.. మునుగోడు మండల కేంద్రం శివారు కమ్మగూడెం సమీపంలోని చొల్లేడు రోడ్డులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుమారుడు చిరగోని లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
అప్పుల బాధతో
కౌలు రైతు బలవన్మరణం
రామన్నపేట: అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సిరిపురం గ్రామానికి మోటె నర్సింహ(50) కొన్నేళ్లుగా గ్రామశివారులో పద్నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలంలో వరితో పాటు పత్తి సాగు చేశాడు. ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో సగానికి పైగా వరి పొలం ఎండిపోయింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందసాగాడు. సోమవారం ఉదయం స్థానిక శివాలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం పొలం చూడడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు. అనంతరం ఇంటికి తిరిగివచ్చి మంచంపై పడుకొని వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
Comments
Please login to add a commentAdd a comment