జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
నల్లగొండ టూటౌన్: శాసనసభలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులు ఉండవద్దనే ఉద్దేశంతోనే జగదీష్‌రెడ్డిని సభను సస్పెన్షన్ చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి జెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల చేతిలో నుంచి దిష్టిబొమ్మ లాక్కుని పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, రేగట్టే మల్లీఖార్జున్‌రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేష్, కరీంపాషా, గోవర్ధన్, బొమ్మరబోయిన నాగార్జున, యుగేంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment