కోతకొచ్చిన వరిచేలు
నల్లగొండ అగ్రికల్చర్: యాసంగి సీజన్ వరి చేలు కోతకొచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆయకట్టు, నాన్ ఆయకట్టులో కోతులు ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 5,12,443 ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు. జిల్లాలో రైతులు ఈ సీజన్‌లో ముందస్తుగా వరి సాగు చేపట్టారు. దీంతో కోతలు కూడా ముందుగానే వస్తున్నాయి. ఆయకట్టు ప్రాంతంలోని రైతులు మిర్యాలగూడ సమీపంలోని మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. నాయ్‌ఆయకట్టులో రైతులు ధాన్యం ఆరబోసి ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మండలాల్లోనే వరిసాగు అత్యధికం..
మిర్యాలగూడ మండలంలో 41,672 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అలాగే నల్లగొండ మండలంలో 35,501, నిడమనూరు 35,443, కనగల్ 35,096, మాడుగులపల్లి 34,010, త్రిపురారం 28,861, తిప్పర్తి మండలంలో 28,396 ఎకరాల్లో వరిసాగైంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడతోపాటు ఇతర మండలాల్లో ప్రస్తుతం వరిచేలు పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ఇప్పుడే ఈనుతుండగా.. మరికొన్ని కోతకు సిద్ధమయ్యాయి. నాన్ ఆయట్టు పరిధిలోని అనేక మండలాల్లో యాబైశాతానికిపైగా చేలు ఎర్రబరాయి. ఆయా ప్రాంతాలోని చేతికొచ్చిన చేలను రైతులు కోతమిషన్లతో కోయిస్తున్నారు.
12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా..
జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరికోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నందున ఈ నెల 20 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్, సహకార, డీసీఎంఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఫ ముందస్తుగా నాట్లువేసిన చోట ప్రారంభమైన కోతలు
ఫ మరికొన్ని చోట్ల ఇప్పుడే ఈనుతున్న పొలాలు
ఫ జిల్లాలో 5,12,443 ఎకరాల్లో వరిసాగు
Comments
Please login to add a commentAdd a comment