గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
చింతపల్లి: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్లే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యసేవలు, ఇతర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొందరు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్లతో మాట్లాడి ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చారని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంతకుముందు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మండలంలో తాగునీటి సరఫరా, తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. హరిజనపురంలో కొత్త వాటర్ ట్యాంకు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, వైద్యాధికారి శ్రీదేవి, మిషన్ భగీరథ ఏఈ ఇక్బాల్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ చింతపల్లి పీహెచ్‌సీ తనిఖీ