బకాయి చెల్లించకుంటే.. భవనం జప్తు | - | Sakshi
Sakshi News home page

బకాయి చెల్లించకుంటే.. భవనం జప్తు

Published Fri, Mar 28 2025 1:55 AM | Last Updated on Fri, Mar 28 2025 1:51 AM

వడ్డీ మాఫీ సద్వినియోగం

చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేసింది. పన్ను బకాయి పడ్డ వారంతా వెంటనే పన్ను చెల్లించి వడ్డీ మాఫీ సద్వినియోగం చేసుకోవాలి. పన్ను చెల్లించకుంటే బకాయి ఉన్నవారి ఆస్తులు జప్తు చేస్తాం.

–సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌,

మున్సిపల్‌ కమిషనర్‌

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పాత బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయడంతో మున్సిపల్‌ యంత్రాంగం మొండి బకాయిలపై దృష్టి సారించింది. వడ్డీమాఫీకి సంబంధించి విధివిధానాలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో మున్సిపల్‌ సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. నీలగిరి మున్సిపాలిటీలో దాదాపు 100 మంది ఉద్యోగులు, సిబ్బంది ఆస్తి పన్ను వసూలు కోసం కాలనీలన్నీ తిరుగుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తులు చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో ఆస్తులు జప్తులు చేసిన విషయాన్ని సైతం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. 40 వేల వరకు భవనాలు ఉన్న నీలగిరి పట్టణంలో ఇంకా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం మార్చి నెలాఖరులో ఉత్తర్వులు ఇవ్వడంతో సమయం కూడా తక్కువగా ఉంది. ఈ నెల 31లోగా మొత్తం ఆస్తి పన్ను చెల్లిస్తేనే 90 శాతం వడ్డీ మాఫీ వర్తించనుంది. మొండి బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయాలని ఇప్పటికే స్పెషల్‌ ఆఫీసర్‌ మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మొండి బకాయిలు రూ.7 కోట్లు..

నీలగిరి మున్సిపాలిటీలో కొందరు బడాబాబులు కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నారు. మొండి బకాయిదారులందరు కమర్షియల్‌ వ్యాపారం చేసేవారు కావడం గమనార్హం. వాళ్లు వ్యాపారం చేసి లక్షల రూపాయలు వెనకేసుకుంటూ కూడా ఆస్తి పన్ను చెల్లించకుండా రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారు. కానీ ఈ ఏడాది మున్సిపల్‌ ఉన్నతాధికారులు ఆస్తి పన్ను వసూలుపై సీరియస్‌గా ఉండడంతోపాటు మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ అధికారులకు మెమోలు ఇస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. నీలగిరి పట్టణంలో మొండి బకాయిదారులు 70 మందికి పైగానే ఉన్నారు. వీరంతా లక్షల్లో పన్ను బకాయి పడి ఉన్నారు. ఈ 70 మంది రూ.7.50 కోట్లకు పైగానే ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిల వడ్డీని 90 శాతం మాఫీ చేయడంతో వీరికి కూడా భారం తగ్గిందనే చెప్పాలి. పన్ను చెల్లించడానికి వీరికి వెసులుబాటు కూడా ఉంది.

ఫ నీలగిరి మున్సిపాలిటీలో రూ.7 కోట్ల మొండి బకాయిలు

ఫ రేపటి నుంచి ఆస్తుల జప్తునకు శ్రీకారం చుట్టనున్న మున్సిపాలిటీ

ఫ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన స్పెషల్‌ ఆఫీసర్‌

శనివారం నుంచి జప్తులు..

ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం మాఫీ కావడంతో బకాయిదారులు కొందరు వాయిదా పెట్టినట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. రెడ్‌ నోటీస్‌లు అందుకున్న 70 మంది మొండి బకాయిదారులు శుక్రవారంలోగా ఆస్తి పన్ను చెల్లించకుంటే శనివారం వారి ఆస్తులు జప్తు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. వాణిజ్య వ్యాపారాలకు వినియోగిస్తున్న భవనాలను సీజ్‌ చేయడంతోపాటు నల్లా కనెక్షన్‌ కట్‌ చేయనున్నారు. అదేవిధంగా స్పెషల్‌ ఆఫీసర్‌ అనుమతితో విద్యుత్‌ సరఫరా కూడా కట్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో బకాయిదారుల ఇళ్ల ఎదుట చప్పుట్లు ఉద్యోగుల నిరసన లాంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి జిల్లా కేంద్రంలో కూడా మొండి బకాయిలు చెల్లించని వారి భవనాల వద్ద నిరసన తెలపడంతోపాటు ఆస్తులు జప్తులు చేయనున్నారు.

బకాయి చెల్లించకుంటే.. భవనం జప్తు1
1/1

బకాయి చెల్లించకుంటే.. భవనం జప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement