
రైస్ మిల్లర్ల పరేషన్
మిర్యాలగూడ: రాష్ట్ర ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం డిమాండ్ పడిపోయింది. గతంలో కంటే 80శాతం మేరకు మార్కెట్‌లో సన్న బియ్యం డిమాండ్ లేకపోవడంతో తమ వద్ద ఉన్న బియ్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక మిల్లర్లు సతమతమవుతున్నారు. పైగా గత వానాకాలం సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యంలో 20శాతం మేరకు నిల్వ ఉండగా ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లుల్లో గోదాములు నిండుకుండలా ఉన్నాయి. మార్కెట్‌లో సన్న ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు..
ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 100, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 మిల్లులు ఉన్నాయి. ఇందులో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోనే 90కు పైగా మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల ద్వారా అత్యధికంగా సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
పెరిగిపోతున్న మిల్లింగ్ చార్జీలు..
ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి కూడా రావడం లేదని మిల్లర్లు వాపోతున్నారు. క్వింటాకు రూ.2300 సన్నరకం ధాన్యం కొనుగోలు చే స్తే దానిని బాయిలర్‌లో వేసేందుకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు వస్తుంది. దీంతో క్వింటాకు రూ.2700 వరకు ధర పడుతుంది. దాన్ని మిల్లింగ్ చేసినట్లయితే 55కేజీల బియ్యం, 10 కేజీల నూక వస్తుంది. 55కేజీల బియ్యానికి రూ.2700 ఖర్చయితే మిల్లులకు కిలో బియ్యానికి హెచ్‌ఎంటీకి రూ.45, ఇతర క్వాలిటీకి రూ.48 ఖరీదు అవుతుంది. బ్యాగులు, ఎగుమతుల చార్జీలు, హమాలీల ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ.5 ఖర్చు పడుతుంది. కానీ మార్కెట్‌లో హెచ్‌ఎంటీకి రూ.4500, ఇతర సన్న రకాలకు రూ.4800 ధర ఉంది. మొత్తంగా రూ.200 నుంచి రూ.300 వరకు నష్టం వస్తుంది. ప్రధానంగా హెచ్‌ఎంటీ రకం బియ్యానికి హైదరాబాద్‌లోనే మార్కెటింగ్ ఉంటుంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్‌లో హెచ్‌ఎంటీ రకం బియ్యం అడిగేవారు లేకపోవడతో ధర పడిపోయింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే సన్నరకం బియ్యం ధర కూడా పడిపోయింది.
కర్ణాటకలో రైస్ భాగ్య పథకం రద్దుతో..
గతంలో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేసే బదులు రైస్ భాగ్య పథకాన్ని(నగదు బదిలీ) అమలు చేశారు. రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు మరికొన్ని కలుపుకుని సన్న బియ్యం కొనుక్కునేవారు. కానీ ఆ రాష్ట్రంలో సన్న ధాన్యం ఎక్కువగా దిగుబడి రావడంతో రైస్ భాగ్య పథకాన్ని రద్దు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాలో బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సన్న ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో బీపీటీ సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా రాబోయే 9 నెలలకు కావాల్సిన స్టాక్ ప్రభుత్వం అందుబాటులో ఉంచుకుంది. దీంతో సన్న బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్‌లో కొనే పరిస్థితి లేకుండా పోయింది.
రూ.600 కోట్లు పెండింగ్..
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అప్పగించేందుకుగాను సీఎంఆర్ కింద మిల్లులకు ప్రతి సీజన్‌కు కేటాయిస్తుంటారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 270కు పైగా మిల్లులు సీఎంఆర్ పైనే ఆధారపడి నడస్తున్నాయి. గత పది సీజన్ల నుంచి సీఎంఆర్ బియ్యం అందించినందుకుగాను ప్రభుత్వం నుంచి మిల్లులకు కోట్ల రూపాయల బాకీ పడి ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.600కోట్లకు పైగా మిల్లింగ్ చార్జీలు రావాల్సి ఉంది. చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేదు. పైగా మిల్లుల వద్ద గన్నీ సంచులు పెండింగ్‌లో ఉన్నాయని సాకులు చెప్పి దానికి గాను మిల్లింగ్ చార్జీలు సరిపోతుందని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం
పంపిణీతో పడిపోయిన డిమాండ్
ఎగుమతులు లేక మిల్లుల్లోనే
బియ్యం స్టాక్
ఐదేళ్లుగా అందని సీఎంఆర్ బిల్లులు
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న మిల్లర్లు
మా ఇబ్బందులను గుర్తించాలి
మిల్లర్ల ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో అన్నిరకాలుగా సహకారం అందించాం. అయినప్పటికీ మాపై నిందలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యంకు డిమాండ్ లేకపోవడంతో మిల్లుల్లో ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోయింది. వాటిని అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నాం. స్టాక్ ఉన్న నిల్వలకు వడ్డీ, తరుగును పరిగణిస్తే నష్టాలే వస్తాయి.
– గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మిర్యాలగూడ పరిసరా ల్లోని మిల్లుల ద్వారా గత సీజన్‌లో చేసిన మిల్లింగ్ చార్జీలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గన్నీ సంచుల పెండింగ్ కారణంతో బిల్లులు ఇవ్వడం లేదు. చిరిగినోయిన, పనికిరాని బస్తాలకు రూ.21 ధర నిర్ణయించడం వల్ల మిల్లర్లకు నష్టం జరుగుతుంది. మిల్లుల వద్ద గన్నీ సంచులను ప్రభుత్వం తీసుకొని మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలి.
– వెంకటరమణచౌదరి, మిర్యాలగూడ
మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి

రైస్ మిల్లర్ల పరేషన్

రైస్ మిల్లర్ల పరేషన్