
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నల్లగొండ: గంజాయి విక్రయిస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం ఖగారియా జిల్లా చౌతాం తాలూకా నిర్పూర్ గ్రామానికి చెందిన రాకేష్‌కుమార్ ఇంటర్ వరకు చదివాడు. ఆపై చదువు ఇష్టం లేక బతుకుదెరువు కోసం సూర్యాపేట జిల్లాకు వచ్చి రైస్ మిల్లులో రెండేళ్ల క్రితం హమాలీగా చేరాడు. అతడికి గంజాయి తాగే అలవాటు ఉండడంతో బిహార్ నుంచి వచ్చేటప్పుడు గంజాయి తెచ్చేవాడు. సంవత్సరం నుంచి నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించిన రాకేష్‌కుమార్ గత ఆరు నెలల నుంచి బిహార్ రాష్ట్రం ఖగారియా జిల్లా దమారా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముండే పుష్పయాదవ్ దగ్గర గంజాయి కిలో రూ.12500 చొప్పున కొనుగోలు చేసి నల్లగొండకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రూ.300 ఒక్క ప్యాకెట్ చొప్పున విక్రయిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సొంత గ్రామానికి వెళ్లిన రాకేష్‌కుమార్ పుష్పయాదవ్ వద్ద రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి శుక్రవారం సాయంత్రం రైలులో నల్లగొండకు వచ్చాడు. అతడు రైలు దిగి వెళ్తుండగా.. పక్కా సమాచారం మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ వద్ద రాకేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాకేష్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించామని, పుష్పయాదవ్ పరారీలో ఉన్నట్లు డీఎస్ప పేర్కొన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాకేష్‌కుమార్ నుంచి గంజాయి కొనుగోలు చేసిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
రెండు కిలోల గంజాయి స్వాధీనం