
సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయం
● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ టౌన్: 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ సహకార వ్యవస్థ పురోగతికి సహకార సంఘాలు, డీసీఓ వ్యవస్థ, బ్యాంకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యాపారంలో, లాభాలు గడించడంలో, ఎన్‌పీఏలు తగ్గించడంలో ముందుందన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, కొండ సైదయ్య, గుడిపాటి సైదయ్య, వంగూరి రంగాచారి, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, వీరస్వామి, శ్రవణ్‌కుమార్, సీఈఓ శంకర్‌రావు పాల్గొన్నారు.
ఎంజీయూ పీజీ,
ఎంసీఏ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీజీ మూడో సెమిస్టర్, ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను శనివారం యూనివర్సిటీ చీఫ్ ఆఫీసర్ ఆప్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. పీజీ, ఐపీసీ అండ్ ఐఎంఏఈలో 72.61 శాతం, ఎంసీఏలో 76.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
భవనంపై నుంచి
జారిపడి తాపీ మేస్త్రి మృతి
పెద్దఅడిశర్లపల్లి: మిషన్ భగీరథ ప్లాంట్‌లోని భవనంలో లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం జరిగింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం అబ్బనబోయినగూడెం గ్రామానికి చెందిన నర్ర నర్సింహ(50) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ సమీపంలో మిషన్ భగీరథ ప్లాంట్‌లోని పంప్ హౌజ్ ఫేస్–1 భవనంలో ఏర్పడిన లీకేజీకి గత మూడు రోజులుగా అతడు మరమ్మతులు చేస్తున్నాడు. శనివారం మరమ్మతు పనులు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద జారిపడ్డాడు. దీంతో నర్సింహ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.