
రేవంత్‌రెడ్డితోనే మాదిగలకు న్యాయం జరిగింది
● ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
చండూరు: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి వలన మాదిగలకు న్యాయం జరిగిందని, ఆంధ్రాలో మాత్రం మంద కృష్ణమాదిగ వల్ల అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. రాష్ట్రంలో మాదిగలకు 9శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా చండూరులో శనివారం నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతిఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. రోస్టర్ పాయింట్ 6శాతం కాకుండా 7శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మంద కృష్ణమాదిగ కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వర్గీకరణ జీఓ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా జిల్లాల వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల నిర్విరామ పోరాట ఫలితంగా 9శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, ఓయూ అధ్యక్షుడు జోగు గణేష్, సంజీవ, విజయ్, జంగయ్య, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.