
బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలి
నల్లగొండ టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. అప్పుడే 2028లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. సోమవారం నల్లగొండలోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ 11 సార్లు సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తే 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడయ్యారని జనాభాలో సగం కూడా లేని వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 11 సార్లు ఎలా అధ్యక్షుడవుతాడని ప్రశ్నించారు. ఈసారి అయినా బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగిన బీజేపీ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్లుగా బీసీల ఎందుకు అవకాశం కల్పించలేదన్నారు. బీజేపీ కూడా అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తేనే రాష్ట్రంలో మనుగడ ఉంటుందన్నారు. రెండు రోజుల్లో హైదరాబాద్‌లో మేధావులు, కుల సంఘాల నాయకులతో సెమినార్ నిర్వహించి ఈ రెండు పార్టీల కుల రంగును బయట పెడతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నల్ల సోమమల్లయ్య, నకిరెకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, చొల్లేటి రమేష్, బూడిద మల్లికార్జున్, జిల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య, గుండా కోటప్ప, అంజయ్య, లింగస్వామి, నల్ల మధు, సైదులుగౌడ్ పాల్గొన్నారు.
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్