
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
మండుతున్న ఎండలు
ఫ 41 డిగ్రీలకు చేరిన సగటు ఉష్ణోగ్రత
ఫ బయటికి వెళ్లేందుకు జంకుతున్న జనం
నల్లగొండ టౌన్ : భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో గాలితో తేమశాతం పడిపోతుండడంతో ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మాడుగులపల్లిలో సోమవారం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 11 గంటలకే ఆయా పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారి కర్వ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాదాచారులు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మండుతుంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.
ఏసీలు, కూలర్లకు పెరిగిన గిరాకీ..
ఎండల మండుతుండడంతో ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది. పట్టణాలు, పల్లెలు ఆనే తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కూలర్ ధర కంపెనీని బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. ఏసీలు కూడా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ధర ఉన్నాయి.