
ఏఎమ్మార్పీ కాలువలో పడి బాలుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి: ఏఎమ్మార్పీ కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శని వారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుగ్యాల గ్రామానికి చెందిన మంటిపల్లి శివతేజ(11) శనివారం ఉదయం తమ వ్యవసాయ పొలం వద్దకు తల్లిదండ్రులతోపాటు వెళ్లాడు. వ్యవసాయ పొలం పక్కనే ఉన్న ఏఎమ్మార్పీ లింక్ కెనాల్‌కు మంచినీళ్ల కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోతుండగా చూసిన గ్రామస్తులు కాపాడేందుకు ప్రయత్నిచంగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి
చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద హైదరాబాద్–విజయవాడ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల దాసాయిగూడెం గ్రామానికి చెందిన రుషిగంపల భిక్షం (53), మోతె మండల నామవరం గ్రామంలో బంధువుల ఇంట్లో ఓ కార్యం నిమ్తిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో భిక్షం అక్కడికక్కడే మృతిచెందాడు, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
చింతపల్లి: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చింతపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చింతపల్లి ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లికి చెందిన గండికోట మురళి సరస్వతి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా కూలి పనులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారి కుమారుడు సతీష్(6) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి కుమారున్ని వెతకగా ఇంట్లోని సంపులో పడి ఉన్నాడు. వెంటనే బాలుని సంపులో నుంచి తీసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బాలుని తల్లిదండ్రులు ఇరువురు కూలి పనులకు వెళ్లగా బాలుని నాయనమ్మ గండికోట అంజమ్మ, బాబాయి గండికోట శీను తోపాటు మామలు గోగుల జగన్ గోగుల స్వామిలు ఇంటి వద్ద ఉన్నారు. తమ కుమారుడిని మృతికి వారే కారణమని తల్లి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తమ కుమారుడి మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.