
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
పన్ను చెల్లింపునకు అంతరాయం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను చెల్లించేందుకు వచ్చిన ప్రజలు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంవత్సరం ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రాయితీపై ఆస్తి పన్ను చెల్లించడానికి ఇక రెండు రోజులే సమయం ఉండడంతో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. సర్వర్లు పని చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచే సర్వర్ల సమస్య తలెత్తడంతో పన్నులు చెల్లించే అవకాశంలేక కొందరు వేచి చూడగా, మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ