
ఎండలకు వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
నల్లగొండ టౌన్ : ఈ వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో ఇప్పటికే 2.5 లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. జిల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో మారో 2 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచింది. దాంతో పాటుగా అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ మేట్లు, ఆశ వర్కర్లు వద్ద కూడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. వడదెబ్బ బాధితులకు అత్యవర సేవలను అందించడానికి అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సెలెన్ బాటిళ్లను సిద్దం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలను చేపట్టింది.
వెంటనే వైద్యం అందించేలా
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు
జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అందులో వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రభలి ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే ఆ టీం ఆ గ్రామానికి చేరుకుని వారికి అవసరమైన వైద్య చికిత్సలను అందించనుంది. అదే విధంగా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి సమాచారం అందిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంలోని సభ్యులను ఆయా ప్రాంతాలకు పంపించనున్నారు.
వైద్యులు అందుబాటులో ఉందాల్సిందే..
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సమయపాలన పాటించడంతో పాటు పనిచేసే చోటే ఉండాలనే స్పష్టం చేసింది, వేసలో వచ్చే అన్ని రకాల జబ్బులను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఫ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాల నిర్వహణ
ఫ అందుబాటులో 2.5 లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు
ఫ నిత్యం అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశాలు
వేసవిలో జాగ్రత్తగా ఉండాలి
ఎండలు పెరుగున్న నేపథ్యంలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధంగా ఉంది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా వారికి అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందబాటులో ఉంచాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ

ఎండలకు వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్