వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్ర పరిధిలో కొలువైన నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన శ్రీ పావన లక్ష్మీనృసింహస్వామిని, సుదర్శనమూర్తులను దేవాలయం ప్రధాన ద్వారం ఎదురుగా యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకలశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మద్దిలేటిస్వామి ఆలయంలో..
బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మాఘ మాసాన్ని పురస్కరించుకొని స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాలాచక్రవర్తి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవ, విశ్వక్సేనారాధన, వాసు దేవ పుణ్యహవచనం, సుదర్శన హోమం, నవ కలశ స్నపనం, నరసింహ హోమం, పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం, ధన్వంతరి మూల మంత్ర జపం చేశారు. తర్వాత అలంకార ప్రియుడైన స్వామి వారికి సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్యన రమణీయంగా ఊరేగింపు చేపట్టారు.
వైభవంగా స్వాతి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment