మైనింగ్ యజమానులపై జీఎస్టీ భారం
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడుతుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మూడేళ్ల నుంచి బకాయి ఉన్న జీఎస్టీ చెల్లించాలని యజమానులకు కర్నూలులోని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసులు అందుతున్నాయి. నాపరాతి గనుల తవ్వకాల కోసం లీజు అనుమతి, మైనింగ్ ప్లాన్, ఎన్విరాల్‌మెంట్ క్లియరెన్స్ (ఈసీ) ఉన్న యజమానులు బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా 40 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరికి మాత్రమే ఆన్‌లైన్‌లో రాయల్టీలు మంజూరు చేస్తుంది. నియోజకవర్గంలో చాలా మందికి లీజులు ఉన్నప్పటికి ఈసీ, మైనింగ్ ప్లాన్ లేదనే కారణంతో ఆన్‌లైన్ రాయల్టీలు నిలుపదల చేసింది. 2020–21–2021–22–2022–23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీఎస్టీ బకాయిలు చెల్లించాలని యజమానులకు పోస్టల్ ద్వారా నోటీసులు పంపుతున్నారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన మైనింగ్ యజమాని కొప్పుల చంద్రశేఖర్‌రెడ్డి రూ.3.64 లక్షలు బకాయి చెల్లించాలని ఇటీవలనే నోటీసు పంపించారు. మిగిలిన యజమానులకు ఒక్కొక్కరికి నోటీసులు అందుతున్నాయి. నాపరాళ్లు వెలికి తీసి రవాణా చేసేందుకు ఆన్‌లైన్ రాయల్టీలు పొందాల్సి ఉంటుంది. ప్రతి రాయల్టీపై యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి సీనరేజ్, డీఎంఎఫ్ తదితర పన్నులు చెల్లిస్తుంటారు. కానీ జీఎస్టీ ఎప్పటికప్పుడు వాటితో పాటే వసూలు చేయకుండా పెండింగ్ పెట్టి ఒకే సారి లక్షల్లో చెల్లించాలని చెప్పడంతో యజమానులకు దిక్కుతోచడం లేదు. గత మూడేళ్ల నుంచి నిమ్మకుండి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో వసూలు చేసేందుకు సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. పోటీ ప్రపంచంలో నాపరాళ్ల పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో మళ్లీ జీఎస్టీ రూపంలో యజమానులపై పిడుగు పడటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గత మూడేళ్ల బకాయిలు చెల్లించాలని
నోటీసులు
సర్కారు నిర్ణయంతో నాపరాళ్ల
పరిశమ్ర మనుగడపై తీవ్ర ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment