
డెయిరీకి జగత్ విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్
తీసుకున్న అప్పు తక్షణమే
చెల్లించాలి
● బోర్డు మీటింగ్ అనంతరం చైర్మన్
ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి
● మందీ మార్బలంతో డెయిరీలోకి
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ
● ఎండీ సీట్‌లో కూర్చొని హల్‌చల్
● పరస్పర సవాళ్లతో వేడెక్కిన రాజకీయం
నంద్యాల(అర్బన్): జగత్ విఖ్యాత్‌రెడ్డి డెయిరీ నుంచి డబ్బు తీసుకొని డీఫాల్టర్ అయ్యారని.. సొసైటీ ప్రెసి డెంట్‌గా అనర్హుడు కాబట్టే చక్రవర్తులపల్లె సొసైటీని రద్దు చేశామని విజయడెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం డెయిరీలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. అయితే విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మందీ మార్బలంతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వెంటనే పోలీసులు డెయిరీ వద్దకు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. వచ్చీ రావడంతోనే ఎమ్మెల్యే.. ఎండీ ప్రదీప్‌కుమార్ సీట్‌లో కూర్చొని హల్‌చల్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే తిష్టవేయడంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు.
● ఇదిలా ఉంటే బోర్డు మీటింగ్ అనంతరం చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తన అనుచరులను వెంటేసుకొని డెయిరీలోకి వచ్చి హల్‌చల్ చేస్తే ఊరుకొనేది లేదన్నారు. తమ్ముడు విఖ్యాత్‌రెడ్డిని చైర్మన్‌ను చేసేందుకు అఖిలప్రియ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి డెయిరీకి డీఫాల్టర్‌గా ఉన్న విషయాన్ని ఆమె మరువరాదన్నారు. అప్పటి డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నుంచి జగత్ డెయిరీ పాల నాణ్యత చూపి రూ.1.40 కోట్లు రుణంగా తీసుకొని డీ ఫాల్టర్‌గా ఉన్న జగత్ విఖ్యాత్‌రెడ్డి తిరిగి రుణం చెల్లించే వరకు డైరెక్టర్ కాలేడన్నారు. గతంలో తన సీట్‌లో కూర్చోవడం, ప్రస్తుతం ఎండీ సీట్‌లో కూర్చుంటే ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయంలో నడుస్తున్న డెయిరీ జోలికి రావద్దని, డెయిరీలో అవినీతి జరిగితే ఏ విచారణకై నా తాము సిద్ధమన్నారు. తాను రైతు బిడ్డనని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.45కోట్లు డెయిరీకి ఆదాయాన్ని ఇచ్చామని.. పాడిరైతులు, ఉద్యోగులకు డెయిరీ ఏర్పాటు నుంచి తొలిసారి బోనస్ అందించిన చరిత్ర తమదని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
● ఇదే సందర్భంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఐదేళ్లుగా డీఫాల్టర్ అయినప్పటికీ తమ్ముడు విఖ్యాత్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. చైర్మన్ సీటు పోతుందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోటీసులు ఇప్పుడెందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, కాలమే సమాధానం చెబుతుందన్నారు. సమావేశంలో డెయిరీ డైరెక్టర్ పీపీ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment