కందిపప్పు.. ఇస్తే ఒట్టు
● నామమాత్రంగా కందిపప్పు పంపిణీ
● జిల్లాలో 5.34 లక్షల రేషన్ కార్డులు
● ఫిబ్రవరి నెల కేటాయింపు
2.16 లక్షల కిలోలు మాత్రమే
● సగం మందితో సరిపెడుతున్న వైనం
గోస్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు కంది పప్పు, పంచదార, జొన్నలు, గోధుమపిండి, రాగులు.. తదితర సరుకులు ప్రతి నెలా అందిస్తామని చెప్పిన పాలకుల మాటలు నీటమూటలవుతు న్నాయి. రేషన్ కార్డుదారులకు బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. పూర్తి స్థాయిలో కందిపప్పు ఊసే లేదు. ఇక చక్కెర కూడా అరకొరగా పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్లో ఆకాశన్నంటుతున్నాయి. ఈ సమయంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పంపిణీ చేయాల్సిన కందిపప్పును కంటితుడుపుగా ఇస్తున్నారు. దీంతో కార్డుదారులు మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫిబ్రవరి నెల పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందక కొందరు బియ్యంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 5,34,293 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లాకు ఫిబ్రవరి నెలకు సంబంధించి 6,600 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,16,000 కిలోల కందిపప్పు, 2,13,000 కిలోల చక్కెర కేటాయించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులందరికీ సవ్యంగా కందిపప్పు, చక్కెరను అందించలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో కార్డుదారులకు కొంత మేర అందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.110 నుంచి రూ.120, పల్లెలలో రూ. 120 నుంచి రూ. 140 వరకూ విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఎండీయూ వాహనాల్లో కందిపప్పును పూర్తి స్థాయిలో ఇవ్వక పోవటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో కందిపప్పు రూ.67కే ఒక్కో కార్డుదారునకు అందించాల్సి ఉంది. కానీ ముందుగా రేషన్ తీసుకున్న వారికి మాత్రమే కందిపప్పు అందుతుందని కార్డుదారులు చెబుతున్నారు. జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్యకు అనుగుణంగా కేటాయించకపోవడంతో అరకొరగా పంపిణీ చేస్తున్నారు.
డీడీలు కట్టని డీలర్లు...
బియ్యం పూర్తి స్థాయి కోటాకు ముందుగానే డీడీలు చెల్లిస్తున్నా డీలర్లు కందిపప్పు, చక్కెరకు మాత్రం ముందుకు రావడం లేదు. కార్డుల సంఖ్యకు అనుగుణంగా డబ్బులు కట్టినా ఆ మేరకు కేటాయింపులు లేకపోవడంతో గ్రామాల్లో పంపిణీ సమస్య తలెత్తుతుందని వెనుకడుగు వేస్తున్నారు. అలాగే కందిపప్పుకు అధిక మొత్తం చెల్లించాల్సి రావడం ఒక కారణం కాగా.. బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకునే ఆలోచన ఉన్నా నాణ్యత లేకపోవడంతో మిన్నుకుండిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కందిపప్పు వినియోగదారులకు చేరటం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కందిపప్పు.. ఇస్తే ఒట్టు
Comments
Please login to add a commentAdd a comment