సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం | - | Sakshi
Sakshi News home page

సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం

Published Mon, Mar 3 2025 1:47 AM | Last Updated on Mon, Mar 3 2025 1:47 AM

సర్కా

సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం

సాక్షి, నంద్యాల: కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం దేవుడెరుగు.. కనీసం తాగేందుకు సురక్షిత నీరు అందని పరిస్థితి నెలకొంది. కలుషిత జలం ప్రజల ప్రాణాలను హరిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో డయేరియా పంజా విసురుతున్నా చర్యలు చేపట్టడంలో విఫలమవుతూనే ఉంది. 9 నెలల పాలనలో అతిసారంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో తరచూ తాగునీరు కలుషితమై అతిసారం ప్రబలి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన మంచినీటి పైప్‌లైన్‌ మార్పుపై దృష్టి సారించడం లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా ఇప్పటికీ కుళాయిలకు నీటి సరఫరా అవుతోంది. కొన్ని చోట్ల డ్రైనేజీ కాల్వలో మంచినీటి పైప్‌లైన్లు వెళ్లాయి. వీటి ద్వారా తరచూ నీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అతిసారం ప్రబలిన చోట అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆత్మకూరులో అతిసారం బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఆయా కాలనీలకు నీటిని సరఫరా చేసే జీఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. పైపులు పాచిపట్టి కనిపిస్తున్నాయి. ట్యాంకులను శుభ్రం చేయాలని కొద్ది నెలలుగా స్థానికులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. రెండు వారాలుగా దుర్వాసన, బురద ఉన్న నీరు వస్తుందని చెప్పినా వినలేదు. ఇంతలోనే కలుషిత నీటిని తాగి సుమారు పది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో బషిరూన్‌, రహంతుల్లా, రామచంద్రనాయక్‌ మృతి చెందారు. అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ముగ్గురు బతికేవాళ్లని మృతుల బంధువులు చెబుతున్నారు.

పరిహాసమవుతున్న పరిహారం హామీలు

డయేరియాతో చనిపోయిన మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఈ ప్రభుత్వానికి మనుసు రావడం లేదు. జూపాడుబంగ్లా మండలం చాబోలు గ్రామంలో డయేరియాతో నడిపి నాగన్న చనిపోయిన సమయంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మృతుని కుటుంబాన్ని విడివిడిగా పరామర్శించి ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో డయేరియాతో రామలక్ష్మిదేవి మరణించినప్పుడు ఎమ్మెల్యే జయసూర్య బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆళ్లగడ్డలో ఆరుగురు చనిపోతే కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టించుకోలేదు. అసలు ఆళ్లగడ్డలో అతిసారనే లేదని, చనిపోయిన వారంతా వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆత్మకూరు పట్టణంలో అతిసారంతో ముగ్గురు మృతి చెందినా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. పేదల ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డయేరియాతోనేమా నాన్న చనిపోయాడు

వారం రోజుల నుంచి మా ఇంట్లో ఐదుగురం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాం. మేమంతా త్వరగానే కోలుకున్నాం. మా నాన్న రామచంద్రనాయక్‌కు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఓ క్లినిక్‌లో చూపించాం. అయినా తగ్గకపోవడంతో 27వ తేదీ కర్నూలు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. డయేరియాతోనే చని పోయాడు. మా నాన్నకు బీపీ, షుగర్‌ కూడా లేవు. గత కొద్దిరోజుల నుంచి నీళ్లు, సరిగ్గా రావడం లేదని చెబుతూనే ఉన్నాం. అయినా అధికారులు పట్టించుకోలేదు.

– వెంకటేశ్వరనాయక్‌, గొల్లపేట, ఆత్మకూరు

అతిసార బాధితులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

9 నెలల కూటమి పాలనలో

అతిసారంతో 11 మంది మృతి

ప్రజల ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వని ప్రభుత్వం

ఆత్మకూరు పట్టణంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఆత్మకూరు: మంచినీరు కలుషితం కాకుండా శిథిలమైన పైప్‌లైన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్ల వీధి, గొల్లపేటలో ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ పర్యటించారు. అతిసార వ్యాధితో షేక్‌బషీరిన్‌, రహంతుల్లా, రామచంద్రనాయక్‌ ఇటీవల మృతిచెందగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అతిసారం అనుమానంతో అన్ని పరీక్షలు నిర్వహించామని, మంచినీరులో ఎక్కడా కలుషితమైనట్లు నివేదికలు లేవన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఎన్నో ఏళ్ల క్రితం ఎనిమిది అడుగుల లోతులో మంచినీటి పైపులైన్లను ఏర్పాటు చేశారని, వాటిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మకూరులో రెండు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను సీజ్‌ చేశామన్నారు. అన్ని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లతో పాటు పట్టణంలోని ఇతర ప్రయివేట్‌ యజమానులకు సంబంధించిన వాటర్‌ క్యాన్‌లను, నీటి సరఫరా చేసే బోర్లలోని నీటిని పరీక్షలకు పంపుతున్నట్లు చెప్పారు. ఇటీవల ఓ కంపెనీకి చెందిన చికెన్‌ నిర్వాహకులు ఉచితంగా గుడ్లు, చికెన్‌ పంపిణీ చేశారని, దాని ద్వారా ఏమైనా వ్యాధి సోకిందా అనే విషయంపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అన్ని హోటళ్లు, చికెన్‌ సెంటర్‌లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ రత్నరాధికను ఆదేశించారు. పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో నీలితొట్లె వీధి, గొల్లపేట వీధిలో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలన్నారు. అనంతరం ఆత్మకూరు సీహెచ్‌ఓ కేంద్రాన్ని పరిశీలించి బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ కాంతారావునాయక్‌, ఆర్‌డీఓ నాగజ్యోతి, తహసీల్దార్‌ రత్నరాధిక, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఫక్కీరయ్య, డీసీహెచ్‌ఎస్‌ జబీవుల్లా, డాక్టర్లు షాదియాబేగం, రాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

No comments yet. Be the first to comment!
Add a comment
సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం1
1/2

సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం

సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం2
2/2

సర్కారు నిర్లక్ష్యం.. కాటేస్తున్న అతిసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement