దేవతలారా రారండి!
నేడు అహోబిలంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి హనుమంత వాహన సేవలు నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్యప్రభ వాహనాలపై విహరిస్తారు.
ఆళ్లగడ్డ: దిగువ అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదవరదుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీరంగ రాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకుముందు గరుత్మంతుని చిత్రపటాన్ని, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాముల ఉత్సవమూర్తులను, అహోబిలం మఠంలో కొలువైన మొదటి జియర్ శ్రీ ఆదివన్ శఠగోపన్ ఉత్సవ విగ్రహాన్ని వేర్వేరు పల్లకీల్లో మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా గాలి గోపురం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు చేర్చారు. ఆ తర్వాత ప్రహ్లాదవరదుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ప్రహ్లాదవరదుడి కల్యాణ మహోత్సవం ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ముక్కోటి దేవతలు కదలి వచ్చి, విందారగించి స్వామి అమ్మవార్లను ఆశీర్వదిస్తారని తద్వార లోక కల్యాణం నిర్వహించినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రహ్లాదవరదుడుసింహవాహనంపై కొలువై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను కనువిందు చేశారు.
వైభవంగా భేరీ పూజ..
బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దేవాలయ ప్రాంగణంలో కొలువుంచి తిరుమంజనం అనంతరం ఉత్సవమూ ర్తులను ప్రత్యేక మండపంలో కొలువుంచి శాస్త్రోక్తంగా భేరీ పూజ నిర్వహించారు. భేరి పూజల్లో భాగంగా మృదంగాలను అర్చకులే శృతి, లయ బద్ధంగా వాయించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రధానార్చకులు వేణుగోపాలణ్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
ప్రభవించిన జ్వాలా నరసింహుడు..
అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామి ఉదయం హంస వాహనంపై, రాత్రి సూర్య ప్రభ వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. నిత్య పూజలు అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహులను యాగశాలలో కొలువుంచి పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆ రత్వాత వివిధ పుష్పాలంకరణ గావించిన హంస వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి ప్రతేకంగా అలంకరించిన మండపంలో భక్తుల దర్శనార్థం కొలువుంచారు. రాత్రి స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించి భక్తులను కనువిందు చేశారు.
దిగువ అహోబిలంలో
బ్రహ్మోత్సవ వైభవం
సకల దేవతలను ఆహ్వానిస్తూ
ధ్వజపటావిష్కరణ
సింహ వాహనంపై ఊరేగిన
ప్రహ్లాదవరదుడు
ఎగువ అహోబిలంలో హంస వాహనంపై
దర్శనమిచ్చిన జ్వాలా నరసింహుడు
Comments
Please login to add a commentAdd a comment