‘యువత పోరు’కు తరలిరండి
బనగానపల్లె: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపడుతున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి కోరారు. బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద ఆదివారం యువత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. విలేకరులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే ప్రతి నెలా రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా.. గత బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. ఈ ఏడాది కూడా ఒక పైసా కేటాయించకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీల నుంచి పేద విద్యార్థులను బయటకు పంపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. వీటిలో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేసేందుకు యత్నిస్తోందన్నారు. నాడు– నేడు పనులు అటకెక్కాయని, విద్యార్థుల చదువులకు అడుగడుగునా ఆటంకాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిట్టగా పేరుపొందారన్నారు.
● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకే రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు నిలిపివేయడంతో పేదల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలిరావాలన్నారు.
● విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకుడు అబ్దుల్‌ఖైర్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు అంబటి రవికుమార్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment