నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలు ఉన్న వారు వినతులు అందజేయాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు.
టీబీ డ్యాంలో 25.5 టీఎంసీలు
హొళగుంద: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీరునందిస్తూ వరదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో ఆదివారం 25.547 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో జీరో క్యూసెక్కులు కాగా.. 10,041 కూసెక్కుల నీటిని వివిధ కాల్వకు వదులుతున్నారు. ఎల్లెల్సీకి మార్చి నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని టీబీ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో ఏప్రిల్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది.
సీసీఐ కేంద్రాలపై విజి‘లెన్స్’
ఆదోని అర్బన్: పట్టణంలోని సీసీఐ కేంద్రాల్లో శనివారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్‌డీబీఎల్, ధారశ్రీ పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో దూదిబేళ్లను, జిన్నింగ్ నడిచే విధానాన్ని, రికార్డులను కర్నూలు విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి, ఏఓ విశ్వనాథ్ తనిఖీ చేశారు. స్థానిక సీసీఐ అధికారి భరత్‌ను, మార్కెట్‌యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డిలను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నదుల పూడ్చివేతను ఆపాలి
కర్నూలు(సెంట్రల్): నగరంలోని హంద్రీ, తుంగభద్ర నదుల పూడ్చివేతను అధికారులు ఆపాలని తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం వారు నదుల్లో పూడ్చిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్ బస్తిపాటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నదులను పూడ్చి రోడ్ల విస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టడం భావ్యం కాదన్నారు. ఇటీవల తుంగభద్ర, హంద్రీ నదుల్లో పలు చోట్ల మట్టితో నింపేయడం సరికాదన్నారు. నదుల పరిరక్షణ కు పాటు పడాల్సిన అధికారులు దగ్గరుండి మరీ పనులు చేయించడం దారుణమన్నారు.
‘పది’ విద్యార్థులకుఉచిత బస్సు ప్రయాణం
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.సుధారాణి తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు బస్సుల్లో హాల్ టికెట్ చూపితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రాలకు, పరీక్ష కేంద్రాల నుంచి నివాసానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకునేందుకు పరీక్ష సమయంలో మాత్రమే బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైన పరీక్షను రద్దు చేస్తే పరీక్ష నిర్వహించిన రోజు సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment