కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్‌తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈవీఎం గోడౌన్ల పరిశీలన
నంద్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల పట్టణం టెక్కె మార్కెట్‌యార్డులోని ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించామన్నారు. పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్‌ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని, ఎన్నికల విభాగపు తహసీల్దార్ జయప్రసాద్ పాల్గొన్నారు.
బనగానపల్లె
డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. లలిత తెలిపారు. నంద్యాల పీఎస్‌సీ అండ్ కెవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎస్ పార్వతి, నందికొట్కూరు డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఝాన్సీరాణి.. మంగళవారం కళాశాలను పరిశీలించినట్లు తెలిపారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పనితీరును పరిశీలించి సమావేశం నిర్వహించారన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ అకాడమిక్ అధికారులు ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర శిశు అభివృద్ధి మహిళా సాధికారత అధికారిణి లీలావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి 29వ తేదీలోగా దరఖాస్తులను డబరాల మసీదు దగ్గరలోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ http://nandyal.ap.gov.in పరిశీలించాలన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి