కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్ గత ఏడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈ ఏడాది జనవరి 1న మృతి చెందారన్నారు. అదేవిధంగా వెల్దుర్తి, తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షులు బి.శారద, ఆదెమ్మ వ్యక్తిగత కారణాలతో 2024 మార్చి 29న తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ ఏర్పడిన నాలుగు పోస్టులకు ఎన్నికలను నిర్వహించునున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న నోటీసులు జారీ చేస్తామని, ఆ రోజు నుంచి కోఆప్షన్ సభ్యుల స్థానాలకు 27వ తేది ఉదయం 10 గంటల వరకు, ఎంపీపీ స్థానాలకు ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖాలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న వారి జాబితాలను ప్రకటిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీ, కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారన్నారు.
ఆరు గ్రామ పంచాయతీల్లో
ఉప సర్పంచులకు..
జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. దేవనకొండ మండలం వెలమకూరు, పత్తికొండ మండలం జూటూరు, ఓర్వకల్ మండలం గుట్టపాడు, కర్నూలు మండలం సుంకేసుల, ఆలూరు మండలం మొలగవెళ్లి, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.
ఖాళీగా మూడు జెడ్పీటీసీ స్థానాలు ....
జిల్లా పరిషత్‌లో కూడా మూడు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కల్లూరు జెడ్పీటీసీ వి.ప్రభాకర్‌రెడ్డి 2023 అక్టోబర్ 20న మృతి చెందారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బి.విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల తన జెడ్పీటీసీ పదవికి 2024 జూన్ 14న రాజీనామా చేశారు. ప్యాపిలి జెడ్పీటీసీగా ఉన్న బోరెడ్డి శ్రీరాంరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ నెల 10న మరణించారు. ఈ మూడు స్థానాలతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.