
దేవుడా ఇవేమి తిప్పలు
గోస్పాడు: పింఛన్‌దారుల్లో అనర్హుల ఏరివేత అంటూ దివ్యాంగ లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం కష్టాల పాలుజేసింది. ఎన్నో ఏళ్లుగా పింఛన్ పొందుతున్న వారికి వైద్య పరీక్షలు అంటూ ఆందోళనకు గురి చేస్తోంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహణ దారి తప్పుతోంది. బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల, ముద్దవరం గ్రామాలకు చెందిన దివ్యాంగులకు ఈనెల 25వ తేదీన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంపుకు వెళ్లాలని సంబంధిత సచివాలయ సిబ్బంది ఈనెల 7వ తేదీన నోటీసులు ఇచ్చారు. వారి సూచన మేరకు దివ్యాంగులు మంగళవాం నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎవరిని అడిగినా క్యాంపు నిర్వహణపై సమాధానం లేకపోగా ఒక్కొ క్కరూ ఒకలా చెబుతుండటంతో ఆందోళన చెందారు. చివరకు తేదీ మార్చారని తెలుసుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది క్యాంపులు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలియకుండానే తమ లాంటి వారికి నోటీసులు ఇచ్చి పంపడం ఏమిటని బాధపడ్డారు. దివ్యాంగులమైన తాము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వచ్చాక క్యాంపు నిర్వహించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా సదరం క్యాంపు మొదట్లో ప్రతి వారం మంగళ, బుధ, గురువారాల్లో నిర్వహించే వార మని, ఇటీవల షెడ్యూల్ మార్పు చేసి బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నా రు. కాగా మంగళవారం నంద్యాలకు చేరుకునన్న దివ్యాంగులకు మళ్లీ ఎప్పుడు రావాలో తెలియక పోవడంతో అయోమయంలో పడ్డారు. ప్రత్యేక సదరం శిబిరానికి హాజరు కావాలంటే సచివాలయ సిబ్బంది ఇచ్చే నోటీసులతో వస్తేనే ఇక్కడి వైద్యులు వికలత్వ ధ్రువీకణ పత్రాలు ఇస్తారు. దీంతో దివ్యాంగులు దిక్కుతోచక తిరుగు ప్రయాణమయ్యారు.
దివ్యాంగ పింఛన్‌దారులకు కష్టాలు
25న వైద్య పరీక్షలకు హాజరు
కావాలని నోటీసులు
తీరా వచ్చాక తేదీ మార్చామంటున్న
అధికారులు