
నందికొట్కూరులో చోరీ
నందికొట్కూరు: పట్టణంలోని సాయిబాబాపేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న షేక్ మహబూబ్‌బాషా ఇటీవల తన తమ్ముడు షేక్ రహంతుల్లా కుమారుడు అబ్దుల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆర్‌ఆర్ వెంచర్‌లో ఉన్న తమ్ముడి ఇంటికి మహబూబ్‌బాషా కుటుంబ సభ్యులందరూ ప్రతి రోజు రాత్రి తోడుగా వెళ్లి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 60 తులాల వెండి, రూ. 50 వేలు, విలువైన రెండు గడియారాలు, ముక్కుపుడక అపహరించారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
క్రీడా కేంద్రానికి ఇద్దరు ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): భారత క్రీడల శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్న తైక్వాండో కేంద్రానికి నంద్యాలకు చెందిన పవన్‌తేజ, జంషీద్ హుసేన్ ఎంపికై నట్లు నంద్యాల లయన్స్‌క్లబ్ కార్యదర్శి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలంపిక్ కార్యదర్శి రమణయ్యలు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను గురువారం ఐఎంఏ మాజీ అధ్యక్షుడు రవికృష్ణ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన పాఠశాలలో నిరంతర సాధన కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో వెలుగోడు మాజీ జెడ్పీటీసీ లాలుస్వామి, కోచ్‌లు మహబూబ్‌బాషా, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుకు మండలం రామాపురానికి చెందిన ఉమ్మడి వెంకట్రామిరెడ్డి(48) జీవనోపాధి నిమిత్తం దాదాపు పదిహేనేళ్ల క్రితం అంకిరెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. ఇతనికి దివ్యాంగురాలైన భార్య వసుంధరదేవి ఉంది. వీరికి సంతానం లేదు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్న ఇతను మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి భార్య అనంతపురం జిల్లా యాడికి మండలంలోని చిక్కెపల్లెలోని పుట్టింటికి వెళ్లి పోయింది. అయితే రెండు రోజుల క్రితం ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో వెంకట్రామిరెడ్డి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. కాగా సూసైడ్ నోట్‌లో గోపాల్ అనే వ్యక్తి పేరుతో పాటు, జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.