ఖాతాల్లో డబ్బులు పడటంపై రాజోళిలోచర్చించుకుంటున్న చేనేత కార్మికులు
శాంతినగర్: చేనేత కార్మికుల ఖాతాల్లోకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడటంతో అటు ఆనందం వ్యక్తం చేయాలో లేక ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటామోనని ఆందోళన చెందుతున్నారు. రాజోళిలో 3,800 కుటుంబాలకు పైగా చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,100 మగ్గాలు ఉండగా.. మంగళవారం అకస్మాత్తుగా 168 మంది ఖాతాల్లో రూ.21,14,681లు జమ అయ్యాయి.
అయితే ఈ డబ్బులు ఎవరు వేశారో తెలవకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అయింది. అదే సమయంలో గ్రామానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్లు ఫోన్లు చేసి తామే డబ్బులు బదిలీ చేయించామని, 90 శాతం డబ్బులు తిరిగి తమ అకౌంట్లలోకి పంపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేనేత కార్మికులందరూ మాట్లాడుకుని సగం డబ్బులు తిరిగి పంపేందుకు ఒప్పుకుని కొందరు పంపగా.. మరికొందరు పంపలేదు.
డబ్బులు పంపిన వారి ఖాతాల్లోకి తిరిగి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మళ్లీ జమయ్యాయి. అసలు డబ్బులు ఎందుకు పడుతున్నాయి.. ఎవరు పంపిస్తున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు.
అంతేగాక కొందరికి రూ.7 వేలు, మరికొందరికి రూ.15 వేలు, ఇంకొందరి ఖాతాల్లో రూ.25 వేల వరకు నగదు జమ కావడంతో చేనేత కార్మికులు ఆశ్చర్యపోతున్నారు. ఖాతాల్లోకి దాతలు వేశారా.. లేక సైబర్ నేరగాళ్లు లేక బ్లాక్‌మనీ ఉన్న వారు వేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కాలంలో..
గతంలో కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు రాజోళి చేనేత కార్మికులు ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా... ఇప్పుడు కార్మికుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసి ఉంటారని కొందరు చెప్పుకుంటున్నారు.
మాస్టర్ వీవర్స్ మాత్రం తామే అకౌంట్లలో డబ్బులు వేయించామని వాటిని తమకు పంపాలని ఒత్తిడి తెస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు మాత్రం దాతలు పంపి ఉంటారని చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయమై పోలీస్, చేనేత జౌళిశాఖ అధికారులు స్పందించి చేనేత కార్మికుల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించి.. 1,100 మంది చేనేత కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment