రూ.9.92 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు
‘పేట’ మార్కెట్‌యార్డులో జీరో వ్యాపారానికి కళ్లెం
ఆనందంలో రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు
నారాయణపేట: పేట మార్కెట్‌యార్డు రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచుస్తున్న కవర్‌షెడ్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.09 కోట్లు నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయకుమార్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి చొరవతో మార్కెట్ పాలకవర్గానికి, రైతులు, వ్యాపారస్థులకు, కమీషన్ ఏజెంట్లకు శుభవార్త అందింది.
నిఘా నీడలో మార్కెట్
జిల్లా కేంద్రమైన నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డుకు దామరగిద్ద, మద్దూర్, నారాయణపేట, ధన్వాడ,మరికల్, ఊట్కూర్, మక్తల్, నర్వ మండలాలతో పాటు తెలంగాణ సరిహద్దులోని కర్ణాటకలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తమ పంటలను సీజన్‌లలో విక్రయించేందుకు తీసుకువస్తారు. మార్కెట్ యార్డుకు కంపౌండ్ వాల్ ఉన్నప్పటికి అప్పుడప్పుడు ధాన్యం సంచులు మాయమైన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఆటు రైతులు, ఇటు కమీషన్ ఏజెంట్లకు నష్టం జరిగేది. మార్కెట్‌కు తెచ్చే ధాన్యంతో పాటు క్రయ, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు పాలకవర్గం సభ్యులు అమోదం తెలిపారు.
ధాన్యం తడవకుండా కవర్‌షెడ్లు
వర్షాకాలంతోపాటు అకాల వర్షాలతో రైతులు మార్కెట్‌కు తెచ్చే ధాన్యం సైతం తడిసి రైతులు నష్టపోయేవారు. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు, కమిషన్ ఏజేంట్లు, వ్యాపారస్థులు పలుమార్లు మార్కెట్ అధికారులు, పాలకవర్గాలకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నీకరెడ్డి మార్కెట్ పాలకవర్గంతో చర్చించి రూ.3 కోట్ల వరకు మార్కెట్‌యార్డులో కవర్‌షెడ్ నిర్మాణం చేపట్టేందుకు సూచించారు. ఇందుకు పాలకవర్గం ప్రతిపాదనలు తయారు చేసి మార్కెటింగ్ డైరక్టర్‌కు నివేదికలను పంపించారు. ఇందుకు మార్కెటింగ్ డైరెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రూ.3.09 కోట్లు మంజూరు చేశారు.
జీరో వ్యాపారానికి కళ్లెం
మార్కెట్ యార్డులో జరిగే ధాన్యం క్రయవిక్రయాల్లో ఇప్పటికే ఈ నామ్ ద్వారా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో ఎలాంటి చోరీలు, జీరో వ్యాపారానికి చోటు లేకుండా పోతుందని చెప్పవచ్చు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఓ వైపు రైతులకు కంటి మీద కునుకుపడినట్లయింది. మరో వైపు కాస్తా కూస్తో జరిగే జీరో వ్యాపారానికి కళ్లేంపడినట్లేనంటూ వ్యాపార వర్గాల్లో చర్చకొనసాగుతుంది. మార్కెట్‌కు వచ్చే వాహనాలు, లోడింగ్, అన్‌లోడింగ్ తదితర వాటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. వాహనాల నంబర్‌లతో సహా వచ్చి పోయే గేట్లలో కనిపిస్తాయంటూ చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment