శ్రీశైలం ప్రత్యేక బస్సులు ప్రారంభం
నారాయణపేట రూరల్: మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని శ్రీశైలంలో జరిగే ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఆదివారం మొదటి ప్రత్యేక బస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. శైవ క్షేత్రమైన శ్రీశైలానికి మహాశివరాత్రి పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు ఈ సర్వీసులను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 24, 25తేదీల్లో ఉదయం 6, 8, 10గంటలకు మూడు బస్సులు, 26న ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 15బస్సులు రాకపోకలు సాగించనున్నట్లు చెప్పారు. ఈప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో పాదదర్శనం అనంతరం తిరుగు ప్రయాణానికి భక్తుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, కాలినడకన వెళ్లిన భక్తులు సైతం ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బస్సుల్లో మహిళలకు ఆధార్ కార్డుపై ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.
అహింసా మార్గాన్ని
అనుసరించాలి
దామరగిద్ద: మాతా మాణికేశ్వరి మాత బోధించిన అహింసా మార్గాన్ని అందరం అనుసరించాలని యానగుంది మాతా మాణికేశ్వరి ట్రస్ట్ కార్యదర్శి శివయ్యస్వామి అన్నారు. ఆదివారం మండలంలో ఉడ్మల్‌గిద్దలో వెలసిన మాతా మాణికేశ్వరి ఆలయంలో మాత పాదుక ప్రతిష్ఠాపన 11వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అథితిగా హాజరైన ఆయన మాట్లాడారు. అహింసా మార్గంలో నడవాలని, అహింసో పరమోధర్మ అన్న పరమ సత్యాన్ని మాత మనందరికి బోధించిందన్నారు. ఆలయంలో అమ్మవారి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో జనార్ధన్‌రెడ్డి, సాయన్న బాల్‌చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి లక్ష్మణ్ వీరప్ప, భగవంతు, నర్సిములు, జల్లప్ప, ఎల్లప్ప, బాల్‌చందర్, గజలప్పపాల్గొన్నారు.
కెమికల్ పరిశ్రమకు
అనుమతులు ఇవ్వొద్దు
మరికల్: మండలంలోని చిత్తనూర్ ఇథనాల్ కంపెనీలో కొత్తగా సింథటిక్ కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వద్దన్ని కంపెనీ వ్యతీరేక పోరాట సమితి సభ్యులు ఆదివారం మరికల్‌లో ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఇప్పటికే ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. సింథటిక్ కెమికల్ వ్యతిరేకంగా ఈ నెల 24న చిన్నచింతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అలాగే గతంలో కంపెనీకి వ్యతీరేకంగా ఉద్యమించిన వారిపై పెట్టిన రౌడీ షీటర్ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కోయిల్‌సాగర్‌కు వెళ్తున్న నీటిలో ఒక టీఎంసీ నీరు కంపెనీకి వెళ్లడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. ధర్నా విజయవంతం చేయడం కోసం అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాములు, సుదర్షన్, రాంచంద్రయ్య, మల్లేష్, మధు, లక్ష్మయ్యలు పాల్గొన్నారు.
ఖాతాదారులకు
మెరుగైన సేవలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు పాలక మండలి చైర్మన్ కుమారస్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆదివారం పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 1998లో ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏర్పాటైనట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్ 13న జడ్చర్ల పట్టణంలో నూతన బ్రాంచీని ప్రారంభించామని, త్వరలోనే నాగర్‌కర్నూల్ పట్టణంలో మరో నూతన నాలుగో బ్రాంచీ ప్రారంభిస్తామన్నారు. బ్యాంకుకు 20 వేలకుపైగా ఖాతాదారులు, 3,369 మంది వాటాదారులు ఉన్నారని, రుణాలు రూ.39.61 కోట్లు, డిపాజిట్లు రూ.42.17 కోట్లు, రిజర్వు రూ.12.04 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. రాజేంద్రకుమార్, కృష్ణయ్య, సూర్యనారాయణ, డైరెక్టరు పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రత్యేక బస్సులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment