గురుకుల ప్రవేశ పరీక్షకు 95శాతం హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: గురుకులాల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 5,6,9వ తరగతి ప్రవేశాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మొత్తం 8 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4,100 మంది విద్యార్థులకుగాను 3,896 మంది హాజరయ్యారు. 95 శాతం హాజరుశాతం నమోదు కాగా.. 114 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ యాదమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్రాల వద్ద ట్రాఫిక్‌జాం..
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రం నుంచి కర్ణాటక వైపు వెళ్లే రహదారిపై సరైన నియంత్రణ లేక ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎర్రగుట్ట సమీపంలో సోషల్ వెల్ఫేర్, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలు ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి. రెండు భవనాల్లో కలిపి ఆదివారం జరిగిన గురుకుల ప్రవేశ పరీక్షకు ఏకంగా 1140 మంది విద్యార్థులను కేటాయించారు. అయితే ఉదయం గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ఒకేసారి పరీక్ష నుంచి విద్యార్థులు బయటికి వచ్చారు. దీంతో అంతమంది విద్యార్థులతోపాటు వారి పెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అదేవిధంగా వారి వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో రోడ్డు పూర్తిగా బ్లాక్ అయ్యింది. దీంతో కర్ణాటక నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. గంటకు పైగా ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ముందస్తు ఆలోచన లేకుండా గురుకుల పాఠశాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఒకే చోట పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం, మరోవైపు సరైన ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులను తీసుకోవడంలో పోలీసుల వైఫల్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం ఎండకు తీవ్ర ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వాహనదారులు కోరుతున్నారు.
గురుకుల ప్రవేశ పరీక్షకు 95శాతం హాజరు
Comments
Please login to add a commentAdd a comment