సీపీఐఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: గత పాలకులు ఎస్‌ఎల్‌బీసీకి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే టన్నెల్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోయారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే (సీపీఐఎం) జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఇద్దరు ఇంజినీర్లతోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇరుక్కపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి.. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన టన్నెల్ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా.. 20 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పదేళ్లపాటు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఫలితంగా వ్యయం పెరిగి.. అంచనా బడ్జెట్ రూ.4,600 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. టన్నెల్‌లో ఇరుక్కపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment