రాయితీతో ఊరట..
నారాయణపేట: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీఓ 28ని విడుదల చేయడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ప్రక్రియ వేగవంతానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా.. ఇటీవల కొత్తగా మద్దూర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం 34,396 దరఖాస్తులు అందగా.. 9,381 ఆమోదం పొందాయి. మూడు మున్సిపాలిటీల్లో 21,384, మండలాల్లోని 140 జీపీల్లో 13,012 దరఖాస్తులు రాగా.. రూ.10వేల ఫీజు కట్టిన వెంచర్లు 403 ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను నిషేధిత జాబితాలో అధికారులు గుర్తించారు. అదే విధంగా నిషేధిత ప్లాట్లు మున్సిపాలిటీల్లో 637, గ్రామాల్లో 443 ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల 31వ తేదీలోగా ఎల్‌ఎస్‌ఆర్ ఫీజు చెల్లించే వారికి 25 శాతం రాయితీ ప్రకటించింది.
గ్రామాల్లో ఫీజు కట్టింది ఇద్దరే..
మక్తల్, నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల్లో అనధికారికంగా ప్లాట్లు అమ్ముతున్నారు. వీటిని క్రమబద్ధీకరణ చేసుకుంటేనే నిర్మాణ అనుమతులు వస్తాయి. ఈ క్రమంలో ప్లాట్లను క్రమబద్ధీకరణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టింది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ పరిష్కారానికి మాత్రం నోచుకోలేదు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పరిశీలనలు జరిగినా.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 56 మంది, గ్రామాల్లో ఇద్దరే ఫీజు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు. చాలా మంది ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించడం దరఖాస్తుదారులకు ఊరటనిస్తోందని చెప్పవచ్చు.
రియల్టర్లలో ఆనందం..
జీఓ 28 ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి ఏదేని వెంచరులో కనీసం 10శాతం ప్లాట్ల అమ్మకాలు జరిగినా.. మిగిలిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలోని రియల్టర్లలో హర్షం వ్యక్తమవుతోంది. ప్లాట్లు అమ్మకుండా మిగిలి ఉన్నా.. గతంలో దరఖాస్తు చేయకున్నా.. మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాటు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి భూ యజమాని నుంచి వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ ఫీజు భారీగానే ఉండే అవకాశం ఉంది.
అనధికార లేవుట్లు, ప్లాట్ల
క్రమబద్ధీకరణకు సువర్ణావకాశం
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్
దరఖాస్తులు 34,396
అధికారులు ఆమోదించినవి 9,381
జీఓ 28 జారీతో రియల్టర్లు, ప్లాట్ల యజమానుల్లో ఆనందం
14శాతం ఫీజు.. 25శాతం రాయితీ
జిల్లాలోని మున్సిపాలిటీలు, జీపీల్లో అనధికార ప్లాటును క్రమబద్ధీకరణకు రూ. వెయ్యి రుసుము చెల్లించిన రశీదు, ప్లాటు డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, ఈసీ, సెల్‌డీడ్‌ను జతచేయాల్సి ఉంటుంది. అదే విధంగా అక్రమ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించుకోవాలంటే రూ. 10వేల రుసుముతో సేల్‌డీడ్ ప్రతులు, విక్రయించిన ప్లాట్ల ఈసీలు వెంచర్‌ప్లాన్ జతచేయాలి. ఇది వరకు రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ప్రకారం మార్కెట్ విలువలో 14 శాతం ఆన్‌లైన్ ద్వారా పేమెంట్‌ను కస్టమర్‌తో ఫోన్‌పే లేదా గూగూల్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయించారు. ఇక పై ఫీజులో 25 శాతం రాయితీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది.
రాయితీతో ఊరట..
రాయితీతో ఊరట..
Comments
Please login to add a commentAdd a comment