2న వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వాడటం వల్ల యువత భవిష్యత్‌ను నాశనమవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వీటికి బానిసలుగా మారి జీవితం నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇందులో ఎక్కవ శాతం యువతనే ఉండటం ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. గంజాయి ఇతర నిషేదిత మత్తు పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరమని, వీటిని తీసుకున్నా, రవాణా చేసినా చట్టరిత్యా చర్యలు తప్పవన్నారు. ఇప్పటికై నా యువత నిషేదిత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో చైతన్యం తీసుకురావాలని అన్నారు.
విజేతకు కలెక్టర్ అభినందన
ధన్వాడ: హైదరాబాద్‌లో జరిగిన తొలి చత్రపతి శివాజీ మహిళా కేసరి(రెజ్లింగ్) పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థి నాగలక్ష్మిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. మండలంలోని మందిపల్లితండాకు చెందిన నాగలక్ష్మి ఈ నెల 16 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి విన్నర్‌గా నిలిచింది. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డివైఎస్‌ఓ వెంకటేష్, కోచ్ శ్రీనివాస్, విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్‌ను కలిశారు. మరిన్ని అవార్డులు సాధించాలని కలెక్టర్.. నాగలక్ష్మికి సూచించారు.
పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలి
మద్దూరు: మద్దూరు పట్టణంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న స్థలంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కడా అధికారి వెంకట్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఈఈ రాంచందర్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. రూ.20 కోట్ల నిధులతో నిర్మించి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ స్థలంలో ఉన్న లక్ష్మి నర్సింమస్వామి ఆలయాన్ని రోడ్డు వైపు వచ్చేలా నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ రెండు పనులు ఏకకాలంలో జరగాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలతో, అలయ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆలయ నమునాను అందజేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.
అలసందలు క్వింటాల్ రూ.5,800
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.5,800 ధర పలికింది. అలాగే, శనగలు గరిష్టం, కనిష్టంగా రూ.5,409, ఎర్ర కందులు గరిష్టం రూ.7,619, కనిష్టంగా రూ.6,800, తెల్ల కందులు గరిష్టం రూ.7,656, కనిష్టంగా రూ.6,006, వేరుశనగ గరిష్టం రూ.6,320, కనిష్టంగా రూ.4,320 ధరలు పలికాయి.
2న వనపర్తికి సీఎం రాక
2న వనపర్తికి సీఎం రాక
Comments
Please login to add a commentAdd a comment