
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మక్తల్: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి రబీ సీజన్‌లో సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పలు గ్రామాల ప్రజలు మక్తల్‌కు చేరుకొని రిజర్వాయర్ల నీటి విడుదలకు కృషి చేశారంటూ ఎమ్మెల్యేను సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని, 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరగా 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు. కాల్వ నుంచి పారే చెరువులన్నింటికి నీటిని వదులుతామని, పంటలు సాగు చేసిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రిజర్వాయర్లు నింపేలా తనవంతు కృషి చేస్తానన్నారు.
బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో శివజ్యోతి దర్శనం..
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భక్తులకు శివజ్యోతి దర్శనం కలిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అర్ధరాత్రి శివజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. మాలధారులు పంచాక్షరి నామస్మరణతో శివజ్యోతిని నింగిలోకి వదలగా హరహర మహాదేవ.. శంభో శంకర..నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, మాలధారులు లింగోద్భవ సమయంలో నింగికెగిరిన శివజ్యోతిని వీక్షించారు. అంతకుముందు భక్తులు శివజ్యోతిని తలపై ఉంచుకొని నగర సంకీర్తనలు చేస్తూ.. బాణసంచా పేలుస్తూ భారీ ఊరేగింపుగా పట్టణంలో నుంచి ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తుంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు 2,418 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో ఇటీవల మంత్రి జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆరు వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా..జూరాలకు 2,418 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు చెప్పారు. నదిలోని గుంతల్లోకి ఎక్కువ నీరు చేరడంతో ఇక్కడికి వచ్చే సరికి స్వల్ప ఇన్‌ఫ్లో ఉన్నట్లు తెలిపారు. ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400 ు, భీమా లిఫ్టు–1కు 338 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి మొత్తం 1364 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Comments
Please login to add a commentAdd a comment