వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు

Published Fri, Feb 28 2025 1:18 AM | Last Updated on Fri, Feb 28 2025 1:16 AM

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు

నారాయణపేట: రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మిషన్‌ భగీరథ బడ్జెట్‌ పన్నుల వసూలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ గ్రామాన మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా అవుతున్నాయని, రానున్న వేసవిలో ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే తెలపాలని అధికారులను ఆదేశించారు. వేసవి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళ్లాలని తెలిపారు. నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ కమిషనర్లను ఆయా మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరాపై పూర్తి వివరాలు ఆరా తీశారు.అలాగే పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు, సమావేశంలో మిషన్‌ భగీరథ ఈఈ పి.వెంకటరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమావై రంజాన్‌ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రధానంగా ఎక్కడ తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ బేన్‌షాలం, ఆర్డీఓ రాంచందర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ కమిషనర్లు రంజాన్‌ పండుగ రోజు షామియానాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చూడాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ రంజాన్‌, హోలీ, ఉగాది పండుగలకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, రంజాన్‌ నేపథ్యంలో ఈద్గాలో దాదాపు 10 వేల మంది ప్రార్థనలకు హాజరవుతారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనారిటీ అధికారి ఎంఏ.రషీద్‌, డీఆర్డీఓ మొఘులప్ప, ట్రాన్స్‌కో డీఈ జితేందర్‌నాథ్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement