పడకేసిన పల్లె పాలన
మరికల్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఏడాది క్రితం పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలతోపాటు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఏ గ్రామంలో చూసినా పారిశుద్ధ్య సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్లపైనే మురుగు, చెత్తా చెదారం పారుతున్నాయి. వేసవి ఇంకా రాకముందే తాగునీటి సమస్య కొన్ని గ్రామాల్లో ఉత్పన్నమవుతోంది. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా గ్రామాల వైపు ప్రత్యేకాదికారులు కన్నెత్తయినా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులతో చిన్న చిన్న పనులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 16వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి ఆలస్యం అవుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులు వేతనాలు, ఇతర బిల్లులకు కూడా సరిపోవడం లేదు. పల్లెల్లో పన్నుల వసూలు అంతంత మాత్రమే కావడంతో మోటార్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, ట్రాక్టర్ డీజిల్, ఇతర ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక వేసవి కాలంలో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకాధికారులపై పని ఒత్తిడి
అత్యధిక గ్రామాల్లో ప్రత్యేక అధికారులు గ్రామ సభలు, తీర్మానాలు, వేతనాల చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీలకు వచ్చేందుకు ప్రత్యేక అధికారులు ముఖం చాటేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ సభలు వేతనాలతో చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో ప్రత్యేక అధికారులు సంతకాలు చేయడం లేదని వాపోతున్నారు. కొన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే సమయం తీరిక లేకపోవడంతో బిల్లు చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
నిధుల జాడేది..?
గ్రామాల్లో పాలకవర్గాలు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) కేంద్ర ఆర్థిక కమిషన్(సీఎఫ్‌సీ) నిధులు వస్తాయి. పాలకవర్గాలకు గడువు ముగియడంతో ఏడాది కాలంగా నిధులు విడుదల కావడం లేదు. చిన్న పంచాయతీల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే అరకొర ఆదాయం ఖర్చులో 20–30 శాతానికి కూడా సరిపోవటం లేదు. విద్యుత్ దీపాల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, సామగ్రి కొనుగోలు, మల్టీపర్సన్ కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు భారంగా మారాయి.
గ్రామాల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు
మురుగు కూపాలను తలపిస్తున్న వీధులు
ఏడాదిగా విడుదల కాని నిధులు
అంతంతమాత్రంగానే పన్ను వసూళ్లు
Comments
Please login to add a commentAdd a comment