సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Wed, Mar 5 2025 12:51 AM | Last Updated on Wed, Mar 5 2025 12:47 AM

సర్వం

సర్వం సిద్ధం

నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు

వివరాలు 8లో u

నారాయణపేట రూరల్‌/నారాయణపేట ఎడ్యుకేషన్‌: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 8,791 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 3635, ఒకేషనల్‌లో 521మంది, ద్వితీయ సంవత్సరంలో 4049, ఒకేషనల్‌లో 586మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నారాయణపేటలో 4, మక్తల్‌లో 3, కోస్గి, ధన్వాడలలో రెండు, మిగితావి మద్దూర్‌, దామరగిద్ద, ఊట్కూర్‌, మాగనూర్‌, మరికల్‌లలో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు రెగ్యులర్‌ ఎగ్జామ్స్‌ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.

వసతుల కల్పన..

విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించారు. విద్యార్థులందరూ 8.30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకొని, సెంటర్‌లో వారికి కేటాయించిన స్థానంలో 8.45 నిమిషాలకు కూర్చోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఎండ తాకిడి తట్టుకోవడానికి వీలుగా పరీక్ష కేంద్రాల ఆవరణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు చొప్పున ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ఇక పరీక్ష కేంద్రంలో డబుల్‌ డెస్క్‌ బెంచీలు.. వెలుతురు, గాలి వచ్చే గదుల్లోనే నెంబర్లు వేసేలా గైడ్‌ చేశారు. ప్యాన్లు ఏర్పాటు చేయాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. కేంద్రాల ఆవరణ పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేయడంతోపాటు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే సమయాలలో అన్ని జిరాక్స్‌ సెంటర్‌లను మూసి వేయనున్నారు. విద్యార్థులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రాల లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురావద్దని ఆదేశించారు.

సిబ్బంది కేటాయింపు ఇలా..

పరీక్షల నిర్వహణకు 16 మంది సీఎస్‌లు, నలుగురు అడిషనల్‌ సీఎస్‌లు, 16 మంది డీఓలు, నలుగురు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్‌, మరొక సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను, 450 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. 12 చోట్ల ప్రభుత్వ కళాశాలలు, మరో 4 ప్రైవేటు కళాశాలలు ఉండటంతో అక్కడ మాత్రం అడిషనల్‌ సీఎస్‌ల నియామకం చేశారు. ఇక ఇన్విజిలేటర్లుగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కళాశాల సిబ్బందిని తీసుకోగా, తక్కువ ఉన్నచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ప్రశ్నపత్రాలను 8 స్టాక్‌ పాయింట్‌లలో భద్రపరిచారు. పరీక్షల నిర్వహణకు రెండు రకాల కమిటీలు పని చేస్తున్నాయి. హై పవర్‌ కమిటీలో చైర్‌పర్సన్‌గా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, కన్వీనర్‌గా డీఐఈఓ సుదర్శన్‌రావు కమిటీలో ఒక సీనియర్‌ ప్రిన్సిపల్‌ ప్రతాప్‌రెడ్డి, ఒక లెక్షరర్‌ అంబాజీ ఉన్నారు. స్ట్రాంగ్‌ రూం ఇన్‌చార్జ్‌గా విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు.

ఇన్విజిలేటర్లు

5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌

గతంలో అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్త్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత 5 నిమిషాల వరకు గ్రేస్‌ టైమ్‌ ఉంటుంది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్‌ పరీక్షలకు సంబందించి విద్యార్థి హాల్‌టికేట్‌ పై సంబందిత కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం అవసరంలేదు. ఇంటర్‌ నెట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు వెళ్లే అవకాశం ఉంది. కళాశాల వెబ్‌సైట్‌లో సైతం హాల్‌టికెట్లు ఉండటంతో చాలా వరకు విద్యార్థులు కాలేజీకి వెళ్లి సైతం తీసుకున్నారు. ఫీజు బకాయిల విషయంలో కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం...

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మొత్తం 16 పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందాయి. పరీక్షకు గంట ముందు కేంద్రానికి రావడంతో పాటు అన్ని రకాల పరీక్ష సామాగ్రి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతి ఉండదు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – సుదర్శన్‌, డీఐఈఓ

జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు

హాజరుకానున్న 8,791మంది విద్యార్థులు

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..పకడ్బందీ ఏర్పాట్లు

నిమిషం నిబంధన ఎత్తివేత

రెగ్యులర్‌ విద్యార్థులు

7,684

ఒకేషనల్‌ విద్యార్థులు

1,107

450

No comments yet. Be the first to comment!
Add a comment
సర్వం సిద్ధం1
1/2

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం2
2/2

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement