
ఆత్మీయ భరోసాపై ఆశలు
మరికల్: వలసలను నిరోధించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. పారదర్శకంగా పథకం అమలుకు సంస్కరణలు చేపట్టారు. ఉపాధి పనుల్లో శ్రమించిన భూమి లేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆతీయ భరోసా కింద ఆర్థిక సాయం రూ.12వేల చొప్పున అందించేలా సంకల్పించింది. అయితే ఉపాధి హామీలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను గుర్తిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూలీలు ఆసక్తి చూపారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం అధికారులకు సూచించింది. ఇందుకు గాను జనవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు గ్రామా ల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలను ప్రజల ముందు ఉంచారు. పలు గ్రామాల్లో కూలీలు అభ్యంతరాలు తెలపడంతో పాటు కొత్తగా పథకానికి అర్హులమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో మండల ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో మరోమారు పరిశీలించి పథకానికి అర్హుల జాబితాను పంపించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని మొదటి విడతగా భరోసా నిధులు సైతం జమయ్యాయి. కానీ మిగిత ఆర్హులకు ఆత్మీయ భరోసా కింద డబ్బులు జమ కాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
20 రోజులు పనిచేసిన కుటుంబాల గుర్తింపు
జిల్లాలోని 13 మండలాల్లో 280 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,10,835 జాబ్‌కార్డులు ఉన్నాయి. 2,01,268 మంది కూలీలు ఉండగా 73 వేల మందికి ఉపాధి పనులు కల్పించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీలో కనీసం 20 రోజులకు పైగా పనిచేసి ఉండటంతో పాటు భూమిలేని కూలీలను ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం సహాయం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 20 రోజులు పని చేసిన 8,189 కుటుంబాలను గుర్తించారు. ఇందులో కూడా కేవలం 3,445 కూలీల కుటుంబాలే పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగతా కూలీల కుటుంబాలను మరోసారి పరిశీలించగా మరో 402 మంది కూలీలను అర్హులుగా ఎంపిక చేశారు. దీనికి తోడు గ్రామసభల్లోనూ పథకానికి తాము అర్హులమంటూ 2,239 మంది కుటుంబాలు దరఖాస్తులు అందజేశారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం 3,942 మంది అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.
తప్పని ఎదురుచూపులు
జిల్లాలో 13 మండల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 13 గ్రామలను ఎంపిక చేశారు. మొదటి విడతగా ఆయా గ్రామాల్లోని మొత్తం 197 మంది లబ్ధిదారులకు రూ.6 వేల చొప్పున ఆత్మీయ భరోసా నిధులు కూలీల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగితా 3,745 మంది భూమిలేని అర్హులైన కూలీలకు వారి ఖాతాలో ఆత్మీయ భరోసా నిధులు జమ కావాల్సి ఉంది. అయితే మరోపక్క ఈ పథకానికి సంబంధించి అర్జీలు చేసుకున్న కూలీల్లో అనర్హులే అధికంగా ఉన్నారు. గ్రామసభల్లో 2,239 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 95 మందిని మాత్రమే అనర్హులుగా అధికారులు గుర్తించారు. మిగితా వారు ఉపాధి హామీలో పనిచేయని, జాబ్‌కార్డు లేని కూలీలే పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
జిల్లాలో 3,942 మంది పథకానికి ఎంపిక
పైలెట్ గ్రామాల్లో 197 మంది ఖాతాల్లో డబ్బులు జమ
మిగితా వారికి తప్పని ఎదురుచూపులు
త్వరలో జమ చేస్తాం..
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే మిగితా అర్హులైన కూలీల ఖాతాలో ఆత్మీయ భరోసా సాయం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ నెలాఖరు వరకు ఆత్మీయ భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంది. రాగానే వారి ఖాతాలో జమ చేస్తాం.
– మొగులప్ప, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

ఆత్మీయ భరోసాపై ఆశలు
Comments
Please login to add a commentAdd a comment