
నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వాలి
నారాయణపేట: జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోపు అనుమతులు ఇవ్వాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్‌హల్ లో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాలపై పరిశ్రమల శాఖ జీఎం భరత్‌రెడ్డి అదనపు కలెక్టర్‌కు వివరించారు. టీజీ ఐపాస్ కింద గత జనవరి నుంచి ఈ నెల 6 వరకు 19 పరిశ్రమలకు అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా వాటిలో 8 అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 11 ప్రాసెస్‌లోఉన్నాయన్నారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సి లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో ఆర్టీఓ మేఘా గాంధీ, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, సబ్ రిజిస్టార్ రామ్ జీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెహమాన్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అక్బర్ హబీబ్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, ప్రిన్సిపల్ మెర్సీ వసంత, చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment