ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజల భద్రతపై భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసులు పెండింగ్‌లో లేకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ నూతన సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలనిఅన్నారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, సిఐ లు శివ శంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఎస్‌ఐ లు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్, రమేష్, రాము, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, కృష్ణం రాజు, సునిత పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలోని మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ జ్యోతి అధికారులను అదేశించారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామాల్లో వేసివిలో నీటి ఎద్దడి తదితర ఆంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా చూడాలని అధికారులకు అదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై పూర్తి అవగాహన కల్పించి నిర్మాణం ఎంత వరకు జరిగితే అంత బిల్లులు వస్తాయని వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాంచందర్, ఎంపీడీఓ నర్సింహారెడ్డి, కృష్ణరావ్, ఎంపీఓ రామన్న, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నల్లకుసుమలు క్వింటాల్ రూ.4,109
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి.
మెనూ అమలు తప్పనిసరి
దామరగిద్ద: గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలోని భవనంలో కొససాగుతున్న దామరగిద్ద ఎస్సీ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సమక్షంలో విద్యార్థుల సంఖ్య, మెస్ రిజిస్టర్‌లు, భోజన వసతిని పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారని ఆరా తీస్తూ స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు 549 మంది విద్యార్థులు ఉంటున్నారని ప్రిన్సిపల్ వివరించారు. అయితే, మెయిన్‌గేట్, హెడ్‌లైట్ లేకపోవడంతోపాటు గదుల కొరత పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్‌ను విద్యార్థులు కోరారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
Comments
Please login to add a commentAdd a comment