ఉత్తరప్రదేశ్‌లోని సంచలనం సృష్టించిన బుదౌన్ చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అప్పు పేరిట ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారుల్ని కిరాతకంగా చంపేయగా.. ఆపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నిందితుడు హతమయ్యాడు. అయితే పాత కక్షలతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
చిన్నారుల హత్య నేపధ్యంలో బుదౌన్ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పలు చోట్ల నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న బుదౌన్ డీఎం మనోజ్ కుమార్, బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా కాలనీలోని ఒక ఇంటిలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు ఆయుష్, యువరాజ్, అహాన్ అలియాస్ హనీలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయుష్ (12), అహాన్ అలియాస్ హనీ(8) అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి యువరాజ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ చిన్నారులు ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్నారని బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని వెంబడించారు. అయితే నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుని వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు పిల్లల హత్య నేపధ్యంలో బుదౌన్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోపోద్రిక్తులైన జనం పలుచోట్ల బీభత్సం సృష్టించి నిప్పు పెట్టారు. ఒక దుకాణాన్ని, బైక్‌ను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఘటన తీవ్రత దృష్ట్యా బదౌన్‌లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.
చిన్నారుల హత్య వెనుక...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్బర్ షాప్ నడుపుతున్న సాజిద్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో తన దుకాణాన్ని మూసివేసి, ఎదురుగా ఉంటున్న వినోద్ ఇంటికి వెళ్లి, అతని భార్యను టీ కావాలని అడిగాడు. తరువాత సాజిద్.. టెర్రస్‌పై ఆడుకుంటున్న వినోద్ ముగ్గురు పిల్లలైన ఆయుష్, అహాన్, పీయూష్‌లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
బాధితుడు వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాజిద్ తమ ఇంటిలోనికి వచ్చి, ఐదువేల రూపాయలు కావాలని తన భార్యను డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె ఫోన్‌లో తెలిపింది. తరువాత ఆమె టీ చేయడానికి వంటగదిలోకి వెళ్లింది. ఈలోపు సాజిద్.. వినోద్ పిల్లలపై దాడి చేశాడు. ఘటన అనంతరం నిందితుడు అతని స్నేహితుడు జావేద్‌తో కలిసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.
సాజిద్ దాడిలో ఇద్దరుచిన్నారులు మృతి చెందారు. ఘటన తరువాత సాజిద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి, సాజిద్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. దీనికి ముందు నిందితుడు జరిపిన కాల్పుల్లో సివిల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గౌరవ్ బిష్ణోయ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాజిద్‌కు వినోద్‌కు చాలాకాలంగా వైరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘోరానికి సాజిద్ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment