లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రాముని సన్నిధిలో 500 కిలోల డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ నుంచి 500 కిలోల డ్రమ్‌ను రథంపై అయోధ్యకు తీసుకొచ్చారు. గుజరాత్ కర్ణావతిలోని దర్యాపూర్‌లో దబ్గర్ కమ్యూనిటీ ప్రజలు డ్రమ్‌ను తయారు చేశారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామాలయం ప్రాంగణంలో ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
సూర్యరశ్మి, వర్షానికి గురికాకుండా తట్టుకునేలా ఈ డ్రమ్ తయారు చేశారు. బంగారు, వెండి పొరలతో డ్రమ్ పూత పూయబడింది. ఇనుము, రాగి పలకలను ఉపయోగించి డ్రమ్‌ను తయారు చేశారు. దీని శబ్దం కిలోమీటరు దూరం వరకు వినపడుతుంది. ఆలయ ట్రస్టుకు గుజరాత్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు లేఖ పంపిన తర్వాత ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేశారు.
రామమందిరాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది వీక్షకులను ఆహ్వానించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
Comments
Please login to add a commentAdd a comment