పట్నా: ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? బిహార్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాధ్యమే. 18 నెలల కాలంలో ఏకంగా ఒక మహిళ 8 మంది పిల్లలకు జన్మనిచ్చిందని రికార్డుల్లో రాసి డబ్బులు దండుకున్నారు. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా? 65 ఏళ్లు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకంగా సదరు మహిళకు రూ.1,400, సాయపడిన ఆశ కార్యకర్తకు రూ.600 అందజేస్తారు. అక్రమార్కులు ఈ నిధులనూ వదల్లేదు. ముజఫర్‌పూర్‌లో చోటి కొతియా గ్రామానికి చెందిన లీలాదేవి (65)కి నలుగురు సంతానం. 21 ఏళ్ల కిందట ఆమె తన నాలుగో సంతానానికి జన్మనిచ్చింది.
అయితే, గత ఏడాదిన్నరలో లీలాదేవి 8 మంది పిల్లలను కన్నట్లు రికార్డుల్లో రాసి పారేశారు. ప్రోత్సాహక డబ్బును మింగేశారు. విషయం తెలిసిన లీలాదేవి తన ఖాతా ఉన్న కస్టమర్ సర్వీసు పాయింట్‌కు వెళ్లి నిలదీయగా.. డ్రా చేసిన డబ్బును తిరిగి ఇస్తాం, ఫిర్యాదు చేయవద్దని కోరారు. మరో మహిళ శాంతిదేవి (66) 10 గంటల వ్యవధిలో ఇద్దరికి జన్మనిచ్చినట్లు చూపించారు. ఇలా 50 మందికి పైగా మహిళల పేరిట డబ్బు కాజేసినట్లు తేలడంతో కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఎంక్వైరీకి
ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment