లక్నో: కరోనా సోకడం కంటే ముందే ఎక్కడ మహమ్మారి బారిన పడతామోనన్న ఆందోళనతోనే ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. భయం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి కూడా మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూన్ సిస్టం కూడా అదే స్థాయిలో పనిచేస్తుందని నిరూపించింది 82 ఏళ్ల బామ్మ. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వేళ కాస్త ఊరట కలిగించే వార్త ఇది. డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహానికి తోడు మనోధైర్యంతో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించి వార్తల్లో నిలిచారు. ఉత‍్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కుమారుడు శ్యామ్ శ్రీవాస్తవ డాక్టర్లను సంపద్రించాడు. డాక్టర్ల సలహాలతో కేవలం 12 రోజుల్లోనే హోం ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి ఉపశమనం పొందింది.
ఈ సందర్భంగా శ్యామ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ' ఏప్రిల్ నెలలో మా అమ్మకు కరోనా సోకింది. ఆ సమయంలో ఆమె ఆక్సిజన్ లెవల్స్ 79కి పడిపోయాయి. దీంతో మేం అందరం ఆందోళనకు గురయ్యం. ఆస్పత్రిలో చేర్పించాలని అనుకున్నాం. కానీ ఆస్పత్రుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అందుకే డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాం. ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ప్రోనింగ్ ప్రొజిషన్ ప్రాక్టీస్ చేయిస్తూ లవంగం, కర్పూరం కరోమ్ సీడ్స్తో మిశ్రమం తయారు చేసి ఆవిరి పీల్చడంతో ఆరోగ్యం కుదుట పడింది. అలా చేయడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ కేవలం నాలుగు రోజుల్లో 94కి పెరిగాయి. డయాబెటిస్ , అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది’’ అని చెప్పారు.
ప్రోనింగ్ అంటే ఏమిటి ?
కరోనా వైరస్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు పాత కాలం పద్దతిలో బోర్లా పడుకోవాలి. చాలా ఆస్పత్రులలో ఊపరి ఆడని కరోనా పేషెంట్ల ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. వైద్య భాషలో దీన్ని ప్రోనింగ్ అంటారు. ఇలా రోజుకి ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.
ప్రోనింగ్ పొజిషన్ తో బ్రీతింగ్ లెవల్స్ ఎలా కంట్రోల్ అవుతాయి?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోనింగ్ వ్యాయామం రోజుకు మూడుసార్లు చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ మెరుగ్గా కొనసాగుతాయి. అదే సమయంలో ఈ ప్రోనింగ్ పోజిషన్ వేసిన తరువాత ఎప్పటికప్పుడు పల్స్ మీటర్ సాయంతో ఆక్సిజన్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment