చండీగఢ్: కొద్ది రోజుల పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది. ఇక, ఈ ఏడాదిలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టిసారించింది. ఈ క్రమంలో హర్యానా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆప్ ఐదు కీలక హామీలు ఇచ్చింది. ఇందులో ఉచిత విద్య, ఉచిత విద్యుత్ కూడా ఉంది.
కాగా, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగానే హర్యానాలో కూడా ఆప్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తోంది. హర్యానాలో కూడా ఢిల్లీ మోడల్‌ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పంచకుల నుంచి ఆప్ తన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నేడు ఇంద్రధనుష్ ఆడిటోరియంలో ఆప్ ఐదు హామీలను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ హాజరయ్యారు. ఐదు హామీలను సునీతా కేజ్రీవాల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆప్ నేతలు మాట్లాడుతూ.. ఆప్ అధికారంలోకి వస్తే ఐదు హామీలను అమలు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్, విద్య, ఆరోగ్య సేవలు ఆప్ హామీల్లో ఉన్నాయి. ఇది కాకుండా.. రాష్ట్రంలోని మహిళలలకు ప్రతీ నెలా నిర్ణీత మొత్తంలో డబ్బు కూడా ఇవ్వనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా జైలులోనే ఉన్నారు.
ఆప్ ఐదు హామీలు ఇవే..
1.ఉచిత విద్య..
2.24 గంటల ఉచిత విద్యుత్
3.అందరికీ నాణ్యమైన ఉచిత చికిత్స..
4. తల్లులు, సోదరీమణులందరికీ ప్రతి నెల రూ 1000
5. ప్రతీ యువకుడికి ఉపాధి.
Comments
Please login to add a commentAdd a comment