హర్యానా కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. ఆప్‌తో కటీఫ్‌! | Haryana Congress Leaders Serious Over Alliance With AAP | Sakshi
Sakshi News home page

హర్యానా కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. ఆప్‌తో కటీఫ్‌!

Published Wed, Sep 4 2024 9:12 PM | Last Updated on Thu, Sep 5 2024 10:04 AM

Haryana Congress Leaders Serious Over Alliance With AAP

ఛండీగఢ్‌: హర్యానాలో అసెంబ్లీ ఎ‍న్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. హర్యానాలో ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ చూస్తుంటే.. స్థానిక నేతలు మాత్రం నో అంటున్నారు. దీంతో, రాజకీయంగా రసవత్తరంగా మారింది.

కాగా, హర్యానాతో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండబోదని స్థానిక కాంగ్రెస్‌ నేతలు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరీందర్‌ సింగ్‌ బుధవారం చండీఘడ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉండే అవకాశం లేదనే సంకేతాలు పంపారు. గతంలోనూ ఇండియా కూటమితో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. కానీ ఆప్‌తో ఎన్నడూ తాము అవగాహనకు రాలేదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో పాలక ఆప్‌ తమ నేతలను నిర్బంధించారని, వేధించారని చెప్పారు. ఈ సందర్భంగా శాసనసభ లోపల, వెలుపల తాము ఆప్‌తో పోరాడామని గుర్తుచేశారు. తాము గతంలోనూ ఇదే విషయం స్పష్టం చేశామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ దేశవ్యాప్తంగా పొత్తులపై ఎలాంటి వైఖరి తీసుకున్నా హర్యానాలో మాత్రం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకోవాలని కోరారు. ఆప్‌తో పొత్తుపై స్ధానిక నాయకత్వంతో చర్చించిన మీదటే పార్టీ హైకమాండ్‌ ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక​.. హర్యానాలో అక్టోబర్‌ ఐదో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

మరోవైపు.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో 67 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత హర్యానా సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement