
సాక్షి, కోల్‌కత్తా: ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడంపై వస్తోన్న వార్తలపై తన మౌనానికి స్వస్తి పలికారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదని తన ప్రకటనలో తెలిపారు. తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్ జైన్ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు.
‘భారత చట్టాల ప్రకారం నాకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదు. నిఖిల్ జైన్‌తో జరిగిన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలి. నిఖిల్ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా, భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు’ అని నుస్రత్ పేర్కొన్నారు.
ఎవరి డబ్బుపై వ్యామోహం లేదని, తన సొంత ఖర్చులతోనే కుటుంబ పోషణ చేస్తున్నానని నుస్రత్ తెలిపారు. వారి అవసరాల కోసం తన పేరును, డబ్బును వాడుకున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే అవసరం ఎవరికి లేదని నుస్రత్ జహాన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment